ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం: జంతర్ మంతర్‎లో ఇకపై నిరసనలు నిషేధం

ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం: జంతర్ మంతర్‎లో ఇకపై నిరసనలు నిషేధం

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, క్రాకోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా వేదికైన జంతర్ మంతర్ విషయంలో ఢిల్లీ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనలకు అనుమతించే వేదికల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించారు. అంటే.. ఇకపై జంతర్ మంతర్ దగ్గర నిరసనలు, ధర్నాలు చేయడం నిషేధం. ప్రత్యామ్నాయంగా మరో మూడు ప్రదేశాలను ధర్నా వేదికలుగా ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు 2026, అక్టోబర్ 11 ఉత్తర్వులు జారీ చేశారు.

నిరసనలకు కొత్త వేదికలు ఇవే..

ఢిల్లీ పోలీసుల నూతన ఉత్తర్వుల ప్రకారం.. రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్ ఈ మూడు ప్రాంతాలను నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు ఎంపిక చేశారు. ఈ మూడు ప్రదేశాల్లో నిరసనలు నిర్వహించేందుకు అనుమతులు, ఇతర నిబంధనలకు సంబంధించి ప్రత్యేకంగా సవరించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలను (ఎస్‌ఓపీలను) జారీ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

2022 ఉత్తర్వులకు సవరణ

గతంలో 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన స్థాయీ ఉత్తర్వుల్లో జంతర్ మంతర్‌ను నిరసన వేదికగా పేర్కొన్నారు. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఆ నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నిరసనల నిర్వహణకు సంబంధించి కొత్త వేదికలను నిర్దేశిస్తూ పాత ఉత్తర్వులను సవరించారు.

నిరసనలపై ఎలాంటి ప్రభావం..?

జంతర్ మంతర్ నిరసనలు, ధర్నాలకు కీలక వేదికగా ఉంది. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటుంటాయి. తాజాగా జంతర్ మంతర్‌ను వేదికల జాబితా నుంచి తొలగించడంతో నిరసనకారులు ఇకపై ఎక్కడ ఆందోళనలు నిర్వహించుకోవాలనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, కొత్తగా ప్రకటించిన మూడు వేదికల్లో నిరసనలకు అనుమతులు ఎలా ఇస్తారు..? ఎలాంటి నిబంధనలు అమలు చేస్తారు..? అనే వివరాలు ప్రత్యేక ఎస్‌ఓపీలు విడుదలైన తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పోలీసుల నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు నిషేధిస్తూ రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును ఢిల్లీ పోలీసులు హరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.