రాజీనామా చేసి అప్రూవర్‎గా మారు క్షమిస్తం: జ్ఞానేశ్‎కు రాహుల్ మెసేజ్

రాజీనామా చేసి అప్రూవర్‎గా మారు క్షమిస్తం: జ్ఞానేశ్‎కు రాహుల్ మెసేజ్

న్యూఢిల్లీ: సర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడటంతో పాటు ఏకపక్షంగా వ్యవహరిస్తోన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‎కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సూచన చేశారు. జ్ఞానేష్ కుమార్ నేరం చేశారని.. ఆయన తన పదవికి రాజీనామా చేసి అప్రూవర్‎గా మారితే అతన్ని క్షమిస్తామని చెప్పారు. సీఈసీ పదవి నుంచి తప్పుకోవడమే ఆయన దేశానికి చేసే పెద్ద సేవ అవుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీల ఒత్తిడితోనే జ్ఞానేష్ కుమార్ తప్పు చేశారని.. అసలు సూత్రధారి ఆయన కాదన్నారు. జ్ఞానేష్ కుమార్ ఎలాంటి ఒత్తిడిలో ఉన్నారో మేం అర్థం చేసుకోగలమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని.. రిజైన్ చేసే వరకు అతన్ని నిద్రపోనివ్వమని అన్నారు. జ్ఞానేష్ కుమార్ చరిత్ర అంతా మాకు తెలుసు.. మొత్తం బయటపెడతామని పేర్కొన్నారు. జ్ఞానేష్ కుమార్ ప్రధాని మోడీ ఎందుకు రక్షిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియను ఎన్నికల సంఘం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. జ్ఞానేష్‎ను తొలగించి, ఎన్నికల వ్యవస్థను సంస్కరించి న్యాయం జరిగే వరకు ప్రతిపక్షాల ప్రతిఘటన కొనసాగుతుందని స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం జరుగుతుందని తేల్చిచెప్పారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని అధికారులతో సహా సుమారు 200 మంది ప్రభుత్వ అధికారులు తమతో సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని పంచుకుంటున్నారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం కాపాడటానికి ప్రయత్నిస్తోందని.. ఇండియా కూటమి ఈ పోరాటంలో వెనక్కి తగ్గదని అన్నారు. మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భగవత్ ఈ నలుగురు దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజలంతా ఒకవైపు.. ఈ నలుగురు మరొక వైపు ఉన్నారన్నారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత, ప్రతిపక్షాలు నిరసన చేపడితే పోలీసులు ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో బస్సులు, మెట్రో, రైళ్లును నిలిపివేసి ప్రజారవాణా వ్యవస్థను ఎక్కడికక్కడ స్తంభింపజేశారని మండిపడ్డారు. 

ఎమర్జెన్సీ తరహాలో రోడ్లపై సుమారు 30 వేల మంది పోలీసులను మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీని జైలుగా మార్చి.. ఎక్కడా ఆందోళన తెలిపిన అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరసనలో పాల్గొన్న యువతపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు దాడులు చేశారని ఆరోపించారు. పోలీసులు విపక్ష నేతలను అడ్డుకుని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండాలకు యధేచ్ఛగా వదిలేశారని మండిపడ్డారు. 

సర్ ప్రక్రియలో అక్రమాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‎ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం చేసింది. ఇందులో భాగంగానే సోమవారం (అక్టోబర్ 12) సుప్రీంకోర్ట్ వరకు భారీ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీకి ముందు కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఢిల్లీ పోలీసుల వ్యవహరిస్తోన్న తీరును రాహుల్ గాంధీ వివరించారు. 

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. సర్ పేరుతో దేశంలో ఓట్ చోరీ జరుగుతోందన్నారు. సర్‎కు వ్యతిరేకంగా దేశంలో ప్రజా ఉద్యమం మొదలైందని తెలిపారు. సర్ పక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు.