ఏబీవీపీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి

 ఏబీవీపీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి

టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.. మార్చి 28వ తేదీ మంగళవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టించారు స్టూడెంట్స్. పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ.. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. క్వార్టర్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను అడ్డుకుని.. బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. 30 లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేశారని.. వారి కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీశారంటూ మండిపడ్డారు స్టూడెంట్స్. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగారు విద్యార్థులు.

పేపర్ లీక్ ఘటనలపై ప్రభుత్వం తీరు సరిగా లేదని.. మంత్రి కేటీఆర్ బాధ్యతగా రాజీనామా చేసి.. స్టూడెంట్స్ అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. విద్యార్థి సంఘాల ఆందోళనతో మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రాఫిక్ జాం అయ్యింది. స్టూడెంట్స్ ను పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేడియంకు తరలించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు బీఆర్ఎస్ ప్రభుత్వనికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి..సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు ఏబీవీపీ నేతలు. ప్రస్తుతం మినిస్టర్స్  క్వార్టర్స్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.