2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్సీల అభివృద్ధి అధికారి

2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్సీల అభివృద్ధి అధికారి

మహబూబాబాద్ జిల్లా : రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికిపోయారు మహబూబాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రావూరి రాజు. సోమవారం కార్యాలయం వాచ్ మెన్ గురుచరణ్ ద్వారా 2 లక్షలు లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరిపెడ హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు 2 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు వార్డెన్ బాలరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు లంచం డబ్బు రూ.2 లక్షలు బాలరాజుకు ఇచ్చారు. ఏసీబీ అధికారులు సమకూర్చిన రూ.2 లక్షలు తీసుకుని వార్డెన్ బాలరాజు ఎస్సీ డెవలప్ మెంట్ ఆఫీసర్ రావూరి రాజుకు ఫోన్ చేయగా.. కార్యాలయం వద్ద వాచ్ మెన్ కు ఇవ్వమని సూచించారు. ఆయన చెప్పినట్లే మధ్యవర్తిగా వచ్చిన వాచ్ మెన్ కు రూ.2 లక్షలు చెల్లించగా.. కాసేపటికే ఆయన వెళ్లి అధికారి రావూరి రాజుకు అప్పగించారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేయగా లంచం డబ్బు దొరికింది. వెంటనే లంచం డబ్బు తీసుకుని కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చింది. కెమికల్ బాటిళ్లకు వారి సమక్షంలోనే శీల్ వేసి లంచం డబ్బును సీజ్ చేసి వాంగ్మూలం తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇద్దర్నీ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.