Heeramandi OTT: విమర్శలు, ప్రశంసలతో ఓటీటీలో దూసుకుపోతున్న..సంజయ్‌ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్

Heeramandi OTT: విమర్శలు, ప్రశంసలతో ఓటీటీలో దూసుకుపోతున్న..సంజయ్‌ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్

బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియాలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) ఒకరు. ఈ డైరెక్టర్ హిందీలో ఊహకందని కాన్సెప్ట్స్ తో అనేక పీరియాడికల్ డ్రామాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. అంతేకాదు సంజయ్ తీసిన సినిమాలు అత్యధిక వసూళ్లు కూడా రాబట్టాయి.

ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘హిరామండి: ది డైమండ్ బజార్’.ఏకంగా ఆరుగురు హీరోయిన్లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మనీషా కొయిరాలా,సోనాక్షి సిన్హా,అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, రిచా చద్దా, షర్మిన్ సెగల్,ఫర్దీన్ ఖాన్,శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ మరియు ఇతరులు నటించారు. ఈ సిరీస్‌ మే 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. 

1920లలో స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో పాకిస్తాన్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందించారు.పాక్‌లోని రెడ్-లైట్ ఏరియాలో నివసించే మహిళల పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 8 ఎపిసోడ్ లతో తెరకెక్కిన ఈ సీరీస్ వరల్డ్ వైడ్ గా స్ట్రీమింగ్ లోనే నంబర్ 1 ర్యాంకింగ్‌లో ఉంది. 

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఫిల్మ్ "ఇది ఒక అద్భుతమైన కళాఖండం! నేను మంత్రముగ్ధుడయ్యాను. మళ్ళీ  మాయ చేశాడు!, అంటూ కొందరు అంటుండగా.."కథ, నటన, దర్శకత్వం - అన్నీ అద్భుతంగా ఉన్నాయి.ఈ సిరీస్ తప్పకుండా చూడండి!.."సంజయ్ లీలా బన్సాలీ మాస్టర్ స్టోరీ టెల్లర్. ఈ షో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన "హీరామండి: ది డైమండ్ బజార్"లో నటించిన హీరోయిన్స్ ల కాస్ట్యూమ్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. భన్సాలీ అన్వేషణలో తగ్గట్టుగానే ఆభరణాలను చూపించి మరోసారి శభాష్ అనిపించుకున్నారు.హీరామండి వెబ్ సిరీస్ 190 దేశాలలో హిందీ,ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో కలిపి మొత్తంగా 14 భాషల్లో రిలీజ్ అయింది. అలాగే ఈ సీరిస్ పై పెద్ద ఎత్తున మిశ్రమ స్పందన, విమర్శలు తలెత్తుతున్నాయి.
 
రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హీరమండిలో వస్త్రాలు,ఆభరణాలపై దృష్టి సారించిన సంజయ్ లీలా భన్సాలీ మిస్టేక్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే, ఆ కాలం నాటి వేశ్యలు ఇంతటి హంగు ఆర్భాటాలతో లేరని, జీవించేందుకు చాలా కష్టపడేవారని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సోనాక్షి సిన్హా ఉర్దూ పేపర్ చదుతువున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో..ఆ పేపర్‌లో 2022 సంవత్సరానికి సంబంధించిన న్యూస్ రావడంపై..ఈ కాలం నాటి న్యూస్ అప్పుడే ఎలా ప్రింట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

కథేంటంటే:

1920 స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అక్కడి షాహీ మహల్‌కు పెద్ద దిక్కు మల్లికా జాన్‌ (మనీషా కొయిరాలా). వహీదా (సంజీదా షేక్‌) ఆమె సోదరి. బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి), ఆలంజేబు (షర్మిన్‌ సెగల్‌) ఇద్దరూ ఆమె కుమార్తెలు. ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా) ఖ్వాభాగ్‌ అనే మరో మహల్‌కు పెద్ద. మల్లికా జాన్‌ చేసిన పని వల్ల ఆమెను ద్వేషిస్తూ ఉంటుంది. లజ్జో (రిచా చద్దా) భగ్న ప్రేమికురాలు. మల్లికా జాన్‌ తన చిన్న కుమార్తె ఆలంజేబును వేశ్యలా మార్చాలని చూస్తుంది.

అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్‌దార్‌ (తాహా షా బహదూర్‌ షా)తో ప్రేమలో పడుతుంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇటు మల్లికా జాన్‌కు, అటు తాజ్‌దార్‌ తండ్రికి నచ్చదు. మల్లిక వ్యవహారశైలి కారణంగా వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అందుకు ఫరీదాన్‌తో చేతులు కలుపుతుంది.హీరామండిలో ఒకవైపు ఇన్ని వ్యవహారాలు నడుస్తుండగా, బిబోజాన్‌ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర్య పోరాటంలో గూఢచారిగా వ్యవహరిస్తూ ఉంటుంది. బ్రిటీషర్లతో సత్సంబంధాలు కలిగిన వాలీసాహెబ్‌ (ఫర్దీన్‌ఖాన్‌)తో పరిచయం పెంచుకుని వారి రహస్యాలను తెలుసుకుంటూ ఉంటుంది.

షాహీ మహల్‌కు హుజూర్‌ కావడానికి ఫరీదాన్‌ ఎలాంటి కుట్రలు పన్నింది? వాటిని మల్లికా జాన్‌ ఎలా ఎదుర్కొంది. గూఢచారి అయిన బిబోజాన్‌ విషయం తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు? తదితర విషయాలు తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే.