ఎవర్రా మీరంతా: నిమ్మ రసానికి గ్యాస్ బిల్లు ఏంట్రా బాబూ..!

ఎవర్రా మీరంతా: నిమ్మ రసానికి గ్యాస్ బిల్లు ఏంట్రా బాబూ..!

అన్నం వండటానికి గ్యాస్ కావాలి.. బిర్యానీకి గ్యాస్ కావాలి.. ఇడ్లీ, దోశ ఏదైనా మంట ఉండాల్సిందే.. మరి మంచినీళ్లకు గ్యాస్ అవసరమా అంటే.. అలా ఇలా నవ్వరు.. మరి నిమ్మ రసం తయారీకి గ్యాస్ అవసరమా అంటే.. ఎవడ్రా నువ్వు.. బుద్ది ఉందా.. నీకు బుర్ర ఉందా అంటారు.. అవును.. ఎవడైనా ఇలాగే అంటారు.. మరి మన బెంగళూరు సిటీలోని ఓ హోటల్ వాళ్లు నిమ్మ రసానికి గ్యాస్ బిల్లు వేశారు.. ఏంటీ నమ్మటం లేదా.. ఆశ్చర్యంగా ఉందా.. బిల్లు చూస్తే అందరికీ మైండ్ పోతుంది. నిజం బాసూ.. బెంగళూరు సిటీలోని ఓ హోటల్ కు వెళ్లిన కస్టమర్ కు నిమ్మ రసంపై.. గ్యాస్ బిల్లు వేశారు.. గ్యాస్ పేరుతో హోటళ్ల దోపిడీ ఎలా ఉందో వివరంగా తెలుసుకుందామా.. 

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరా లేక కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. కొందరు ఉన్న గ్యాస్ సిలిండర్లతో హోటల్స్ రన్ చేస్తున్నారు. ఇంకొందరు బ్లాక్‎లో సిలిండర్లు కొని హోటల్స్ నడుపుతున్నారు. పెరిగిన గ్యాస్ ధరల భారాన్ని కస్టమర్లపైనే మోపుతున్నారు. ఈ క్రమంలో ఐటీ రాజధాని బెంగళూర్‎లో ఓ కేఫ్ తీరు చర్చనీయాంశంగా మారింది. నిమ్మ రసానికి గ్యాస్ ఛార్జ్ వేసింది సదరు కేఫ్‌ యాజమాన్యం. 

ఆదివారం (మార్చి 15) ఓ కస్టమర్ బెంగళూర్‎లోని థియో కేఫ్‎కు వెళ్లి రెండు మింట్ లెమనేడ్‌ జ్యూస్ (నిమ్మ రసం) ఆర్డర్ ఇచ్చాడు. రెండింటికి బిల్లు రూ.374 అయ్యింది. అయితే.. ఆ బిల్లు రశీదు చూసిన సదరు కస్టమర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఎందుకంటే బిల్లులో రూ.17 గ్యాస్ క్రైసిస్ చార్జ్ కూడా వడ్డించింది సదరు కేఫ్ మేనేజ్మెంట్. ఈ బిల్లు రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

►ALSO READ | బిడ్డను దత్తత తీసుకున్న ప్రతి తల్లికి ప్రసూతి సెలవులివ్వాల్సిందే.. ఆ రూల్ కొట్టేసిన సుప్రీం కోర్టు

ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఎవర్రా మీరంతా.. నిమ్మ రసానికి గ్యాస్ బిల్లు ఏంట్రా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు నిమ్మరసం తయారీకి వంటగ్యాస్ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిమ్మ రసం చేయడానికి ముందు నిమ్మకాయలను వేడి చేసినందుకు వేశారా ఏంటి బిల్లు అని ఇంకొ నెటిజన్ చమత్కరించాడు.

సోడా తయారీలో కొందరు గ్యాస్ ఉపయోగిస్తారని.. అందుకే గ్యాస్ బిల్లు వేశారని కేఫ్ యాజమాన్యానికి సపోర్ట్‎గా మాట్లాడారు. నిమ్మరసానికి గ్యా్స్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు కేఫ్ యాజమాని రియాక్ట్ అయ్యారు. ఇది బిల్లింగ్ లో జరిగిన పొరపాటని వివరణ ఇచ్చారు. కస్టమర్ నుంచి గ్యాస్ చార్జ్ వసూల్ చేయలేదని తెలిపారు.