GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్

GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్

ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. మిగిలిన ప్రతి మ్యాచ్ గెలవాల్సిన సమయాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అత్యుత్తమ ఆటతీరు కనపరిచింది. మొదట బౌలర్లు విజృంభించగా.. తరువాత బ్యాటర్లు వారికి జత కలిశారు. ఫలితంగా గుజరాత్ జట్టును చిత్తుచిత్తుగా ఓడించి ఎంతో విలువైన 2 పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మొదట టైటాన్స్ 147 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. బెంగుళూరు బ్యాటర్లు 13.4 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించారు. 

పవర్ ప్లేలో 92 పరుగులు

14, 20, 12, 18, 14, 14.. మొదటి ఆరు ఓవర్లలో బెంగుళూరు బ్యాటర్లు చేసిన పరుగులివి. 148 పరుగులు ఛేదనలో ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), డు ప్లెసిస్(64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరవిహారం చేశారు. వీరి బాదుడుకు.. బౌండరీల మోతకు.. చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించారు. అయితే, పవర్ ప్లే ఆఖరి ఓవర్ ఐదో బంతికి డుప్లెసిస్ వెనుదిరిగాడు. 

12 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు

డుప్లెసిస్ పెవిలియన్ చేరాక.. 12 పరుగుల వ్యవధిలో బెంగుళూరు 4 కీలక వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో విల్ జాక్స్‌ (1) ఈసారి నిరాశపర్చాడు. నూర్ అహ్మద్‌ బౌలింగ్ లో షారుక్ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆపై వెంటవెంటనే రజిత్ పటిదార్(2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (4), కామెరాన్ గ్రీన్(1) పెవిలియన్ చేరారు. ఆ సమయంలో దినేష్ కార్తీక్(21 నాటౌట్), స్వపిల్ సింగ్(15 నాటౌట్) జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకొని.. జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఆదుకున్న మిల్లర్- షారుఖ్ ఖాన్

అంతకుముందు బెంగుళూరు బౌలర్లు విజృభించడంతో గుజ‌రాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. డేవిడ్ మిల్లర్(30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్(37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, యశ్‌ దయాల్, విజయ్‌ కుమార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కరణ్ శర్మ, కామెరూన్ గ్రీన్‌లకు తలో వికెట్ దక్కింది.