Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు

Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు

ఈ ఏడాది ఎండలు మాములుగా లేవు, పల్లెలు, నగరాలూ అన్న తేడా లేకుండా అందరి సరదా తీర్చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో డిఫెశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఇంటి నుండి అడుగు బయట పెట్టాలంటేనే బయపడేంత రేంజ్ లో మండిపోతున్నాయి ఎండలు. అసలే మండుతున్న ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజల నెత్తిన మరో బాంబు పేల్చింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఆదివారం (మే 5వ తేదీ) 30మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 247మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.

సోమవారం ( మే 6వ తేదీ )15మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 69మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం మొదలుకొని చిత్తరు వరకు 247మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇదిలా ఉండగా శనివారం భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రకాశం జిల్లా దరిమడుగులో 47.5  డిగ్రీలు, కడప జిల్లా కాలసపాడులో 46.4డిగ్రీలు, నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో 45డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు.ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని,ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయకూడదని సూచించారు.