- 29న హాజరయ్యే అవకాశం ఉందంటున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు
- పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై 3 జిల్లాల నేతలతో ఎర్రవల్లిలో కేసీఆర్ సమావేశం
- అసెంబ్లీ వేదికగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలకు వివరించాలని సూచన
- సమావేశాలయ్యాక సభల తేదీల ప్రకటన.. తొలుత మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వస్తారని, అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. అదే రోజు కేసీఆర్ కూడా సభకు వస్తారని అంటున్నాయి. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదని పార్టీ నేతలకు కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. అవసరమైతే తానే అసెంబ్లీకి వస్తానని పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం అసెంబ్లీ సమా వేశాలు నిర్వహించనుండడంతో.. సభా వేదిక ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెడ్దా మని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లబ్ధిపొందే జిల్లాల్లో బహిరంగ సభల ను నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. తొలుత మహబూబ్‌నగర్ ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ నేతలకు కేసీఆర్ చెప్పినట్టు తెలిసింది.
పార్టీ నేతలకు దిశానిర్దేశం
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని కేసీఆర్ విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘‘కాంగ్రెస్‌ది నాటి నుంచి తెలంగాణకు ఎప్పుడూ ద్రోహమే. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందే. ప్రజల్లోకి వెళ్దాం.. ఉద్యమాన్ని నిర్మిద్దాం. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదాం. బహిరంగ సభలకు ముందుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలే చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లండి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక బహిరంగ సభల తేదీలను ప్రకటిస్తా’’ అని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
