- పోలింగ్ రోజూ ప్రలోభాల పర్వం
- మూడు రోజుల్లో అభ్యర్థుల ఖర్చు రూ. 5 వేల కోట్లకు పైనే..
- ప్రధాన పార్టీలతో పోటీపడ్డ ఇండిపెండెంట్లు
- కొన్ని చోట్ల వద్దన్నా ఇచ్చిపోయిన్రు
- ఇంకొన్ని చోట్ల ఓటర్లే డిమాండ్ చేసిన్రు
వెలుగు నెట్వర్క్ : మున్సిపల్‌ఎన్నికల్లో నోట్ల కట్టలు తెగాయి. పార్టీలకతీతంగా పంపకాల్లో నేతలు, అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో మాదిరి గెలుపోటములకు వ్యూహ, ప్రతివ్యూహాలు, పోటాపోటీ హామీలు ఇవ్వడం ఈ సారి కనిపించలేదు. కనిపించిందల్లా నోట్లే ! ప్రత్యర్థి ఎంత పంచాడు ? మనం అంతకన్నా వెయ్యి ఎక్కువ పంచామా ? లేదా? ఇదే అభ్యర్థుల విజయతంత్రంగా మారింది. ఆదివారం మొదలైన ఈ పోటాపోటీ పైసల పంపకం, సోమ, మంగళవారాలతో పాటు పోలింగ్జరిగిన బుధవారమూ కొనసాగింది.
చిన్నాచితక మున్సిపాలిటీల్లోనూ ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా పంచారు. పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.3 వేల నుంచి రూ.10 వేల దాకా చెల్లించారు. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల్లోనైతే ఒక్కో ఓటుకు రూ. 30 వేల దాకా చదివించుకున్నారు. పలు చోట్ల ఇండిపెండెంట్లు సైతం ప్రధాన పార్టీలతో పోటీ పడ్డారు. కొన్నిచోట్ల ఓటర్లు వద్దంటున్నా అభ్యర్థులు ఇచ్చిపోతే, ఇంకొన్ని చోట్ల ఓటర్లే డిమాండ్‌చేసి తీసుకున్నారు.
గతంలో తమకు ఓటు వేసే ఛాన్స్ఉందనుకునే వాళ్లకే అభ్యర్థులు పైసలు పంచేవారు. కానీ ఈ సారి ట్రెండ్ మార్చారు. పార్టీలకతీతంగా పంకాలు చేపట్టారు. ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల ఇండ్లకూ క్యూ కట్టారు. కుల, మత, వర్గాలతో సంబంధం లేకుండా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లకు లెక్కపెట్టి డోర్‌టు డోర్పంచుకుంటూ పోయారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 2,981 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు ఏం తక్కువ రూ.5 వేల కోట్లు పంచారనే వార్తలు వస్తున్నాయి. పైసలతో పాటు చికెన్, మటన్ ప్యాకెట్లు, మందు బాటిళ్లు, మహిళలకు పట్టు చీరలు, కుంకుమ భరిణెలు, టిఫిన్ బాక్సులు, ఉంగరాలు, గ్యాస్‌స్టవ్‌లు, నిత్యావసర సరుకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే మున్సిపల్ ఓటర్ల పంట పండింది.
ఉమ్మడి రంగారెడ్డి మున్సిపాలిటీలా మజాకా..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, మొయినాబాద్మున్సిపాలిటీల్లో మంగళవారం రాత్రి ఓటు ఖరీదు వేలం పాటలా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ జోష్ఎక్కువగా ఉండే మొయినాబాద్ పరిధిలోని సురంగల్, పెద్దమంగళారం, చిల్కూరు పరిధిలోని వివిధ వార్డుల్లో ఓటుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున పలికింది. ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటాపోటీగా పంచిన చోట ఒక్కో అభ్యర్థికి రూ.50 వేల నుంచి లక్ష దాకా ముట్టింది. శంకరపల్లిలోని ఓ వార్డు పరిధిలో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వెండి నాణేలు, చీరలు, గ్యాస్ పొయ్యిలు పోటీపడి మరీ పంపిణీ చేశారు.
మరో నాలుగు వార్డుల పరిధిలో ప్రధాన పార్టీల అభ్య ర్థులు రూ.25 వేల నుంచి రూ.-30 వేల దాకా పంచారు. ఇబ్రహీంపట్నంలోని ఓ వార్డు పరిధిలో రూ.15 వేల చొప్పున పంపిణీ చేశారు. కొంత మంది పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 13 మున్సిపాలిటీలతో పాటు సంగారెడ్డిలోని పాశమైలారం, ఇస్నాపూర్‌లలో అభ్యర్థులు పోటీ పడి ఓటర్లకు రూ.10 వేల నుంచి రూ.20 వేలదాకా పంచిపెట్టారు.
మేయర్, చైర్‌పర్సన్ అభ్యర్థులైతే కోట్లకు కోట్లు..
ప్రధాన పార్టీల నుంచి మేయర్, చైర్‌పర్సన్ ఆశావహులైతే తమ ప్యానల్ అభ్యర్థుల గెలుపు కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. ఓ అంచనా ప్రకారం కరీంనగర్, నిజామాబాద్‌లాంటి కార్పొరేషన్ల పరిధిలో వీరి ఖర్చు రూ.30 కోట్లు దాటినట్లు చెప్తున్నారు. నిజామాబాద్‌లో ఓ ప్రధాన పార్టీ నుంచి చైర్‌పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థి నామినేషన్ వేయడానికి పెండింగ్‌లో ఉన్న రూ.7 కోట్లకు పైగా ప్రాపర్టీ టాక్స్చెల్లించడమే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో తమ వార్డుల్లో ఎలాగైనా గెలిచి తీరాలని ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా పంచారు.
ఇక తమ ప్యానల్అభ్యర్థుల కోసం రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా అందించారు. ఇలా పలువురు మేయర్, పెద్ద మున్సిపాలిటీల చైర్‌పర్సన్ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎన్నికల స్థాయిలో ఖర్చు చేశారని చెప్తున్నారు. జనగామ లాంటి చిన్న మున్సిపాలిటీలో ఓ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి తన వార్డులో గెలుపుకోసం ఓటుకు రూ.9 వేల చొప్పున ఓటర్లకు పంచారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సూర్యాపేట, చౌటుప్పల్, పోచంపల్లి లాంటి చోట్ల ఓటుకు రూ.-10 వేల వరకు పంపిణీ చేశారని చెప్తున్నారు.
ఒక్కో ఓటుకు రూ. 60 వేలపైనే..
జీహెచ్ఎంసీని ఆనుకొని ఉండే మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డులో అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ.30 వేల చొప్పున పంచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ పడ్డ ఈ వార్డులో పోలింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు పోటాపోటీగా పంచుతూనే ఉన్నారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఓటుకు రూ.5 వేలు ఇవ్వడం మొదలుపెట్టిన ఇద్దరు అభ్యర్థులు పోలింగ్ వరకు ఒక్కో ఓటుకు రూ. 30 వేల దాకా పంపిణీ చేశారు.
మూడు రోజుల ముందు ఓ పార్టీ అభ్యర్థి రూ.10 వేల చొప్పున ఇవ్వగా.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ సైతం రూ.10 వేల చొప్పున పంచాడు. రెండో రోజూ చెరో రూ.10 వేల చొప్పున ఇచ్చారు. పోలింగ్‌కు ముందు రోజు మరో రూ. 5 వేల చొప్పున ఇవ్వగా.. పోలింగ్ రోజున మళ్లీ పోటాపోటీగా రూ.5 వేల చొప్పున పంచారు. దీంతో అప్పటికే ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.60 వేలు తీసుకున్న జనం.. ఇంకా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తారేమోనని భావించి బుధవారం మధ్యాహ్నం వరకు ఓటేసేందుకు బయటకు రాలేదు.
12 తర్వాత ఇక డబ్బులు రావని తెలుసుకొని తాపీగా వచ్చి ఓటేశారు. ఈ విషయం తెలిసి పోలింగ్ బూత్‌లోని సిబ్బంది తెల్లమొహాలేశారు. కాగా, ఈ ఒక్క వార్డులోనే అభ్యర్థులు ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.ఈ వార్డులతో పాటు మరో వార్డులో ప్రధాన పార్టీ అభ్యర్థి ఇంటికి 2 గ్రాముల బంగారం, ఓటుకు రూ.25 వేలు ఇచ్చారు.
ఇంకో వార్డులో ఒక గ్రాము బంగారం, రూ.10 వేలు, ఇదే వార్డులో మరో అభ్యర్థి ఓటుకు రూ.15 వేల చొప్పున ఇచ్చారు. మరో వార్డులోని అభ్యర్థి ఓటుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల దాకా పంచారు. అనేక వార్డుల్లో డబ్బులతో పాటు బియ్యం బస్తాలు, చికెన్, వంట సామగ్రి కూడా పంపిణీ చేశారు.
