మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మనవే: సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో  మెజార్టీ స్థానాలు మనవే: సీఎం రేవంత్ రెడ్డి
  • ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్గేకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రిపోర్ట్
  • ఢిల్లీలో దాదాపు అరగంటపాటు భేటీ
  • రెండేండ్ల పాలనపై ప్రజలు 
  • సంతోషంగా ఉన్నారని వివరించిన సీఎం
  • తెలంగాణ ప్రభుత్వం, పార్టీ పనితీరును ప్రశంసించిన ఖర్గే
  • నేడు లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను పార్టీ కైవసం చేసుకోబోతున్నదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు. రెండేండ్ల ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కాంగ్రెస్‌‌తోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తూ పార్టీకి పట్టం కట్టబోతున్నారని వివరించారు. మున్సిపల్‌‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా కొడంగల్‌‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్‌‌రెడ్డి.. అనంతరం శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం రాజాజి మార్గ్‌‌లోని నివాసంలో ఖర్గేను సీఎం రేవంత్‌‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.  సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, రఘువీర్‌‌‌‌రెడ్డి, అనిల్‌‌ కుమార్‌‌‌‌ ఉన్నారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్‌‌‌‌ స్కీమ్స్‌‌, డెవలప్‌‌మెంట్‌‌ను వివరించారు.  పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందువల్ల పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే  మున్సిపల్‌‌లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. 

అనంతరం పార్టీ  అధ్యక్షుడు ఖర్గేతో సీఎం కాసేపు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల తీరు, సాధించే సీట్లపై మరింత లోతుగా చర్చించ్చినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌‌‌‌కు నోటీసులు, ఆ తర్వాత పరిణామాలను ఖర్గేకు వివరించినట్టు సమాచారం. అలాగే, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించిన్టు తెలిసింది. 

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. మంత్రి వర్గ విస్తరణ/శాఖల మార్పుపై చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్  ప్రభుత్వం, పార్టీ  పనితీరును ఖర్గే అభినందించారు. ఎన్నికల కోసం కాకుండా.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన చేస్తున్నారని సీఎం, మంత్రులను మెచ్చుకున్నారు. ముఖ్యంగా కుల వివక్షను రూపుమాపేలా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచనను ఖర్గే అభినందించినట్టు తెలిసింది.  

నేడు రాహుల్, కేంద్ర మంత్రులతో..

ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్‌‌రెడ్డి ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది.  కేంద్రం ఇటీవల బడ్జెట్‌‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా యంగ్ ఇండియా  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌‌తోపాటు రాష్ట్రంలో విద్యా సంస్థల అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎంతోపాటు మంత్రులు కోరారు. అలాగే, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని అభ్యర్థించారు. 

కానీ.. కేంద్ర బడ్జెట్‌‌లో రాష్ట్రాలకు కాకుండా.. శాఖలవారీగా కేటాయింపులు చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆర్థిక సాయంతోపాటు విద్యా సంస్థల డెవలప్‌‌మెంట్‌‌కు ఎఫ్ఆర్ బీఎం పరిధి మినహాయింపు, విభజన హామీలపై సీఎం మరోసారి కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలిసింది. అలాగే ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారంపై కూడా సీఎం ఫోకస్ పెట్టనున్నట్టు తెలిసింది. 

తాజాగా పోలవరం –నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అనుమతుల కోసం కేంద్రంపై ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి పెంచిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్ట్ అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరాలను ఆ శాఖమంత్రి దృష్టికి తీసుకుపోతున్నట్టు తెలిసింది. 

ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,  జేపీ నడ్డా,  సీఆర్ పాటిల్,  ప్రహ్లాద్ జోషి అపాయింట్‌‌మెంట్‌‌ కోరినట్టు తెలిసింది. అలాగే, బీజేపీ సర్కారు పార్లమెంట్‌‌లో మాట్లాడకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గొంతు నొక్కుతున్న నేపథ్యంలో... ఆయనను కలిసి మద్దతు తెలపనున్నట్టు సమాచారం.