ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్‌‌!..తెలంగాణలో1500లకుపైనే.. హైదరాబాద్ చుట్టూ హైవేలపై గుంతలు, ప్రమాదకర జంక్షన్లు

ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్స్‌‌!..తెలంగాణలో1500లకుపైనే.. హైదరాబాద్ చుట్టూ హైవేలపై గుంతలు, ప్రమాదకర జంక్షన్లు
  • రాష్ట్రవ్యాప్తంగా నేషనల్‌‌ హైవేలపై 1,535 బ్లాక్ స్పాట్స్‌‌ గుర్తింపు 
  • అత్యధికంగా ఉన్న టాప్‌‌ 5 రాష్ట్రాల్లో మూడో స్థానంలో తెలంగాణ
  • రాష్ట్రంలో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌‌ లోపాలు ఉన్నట్లు గుర్తింపు
  • 2,210 బ్లాక్ స్పాట్స్‌‌తో టాప్‌‌లో యూపీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని జాతీయ రాహదారులపై బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ డేంజర్ బెల్స్‌‌‌‌‌‌‌‌ మోగిస్తున్నాయి. నేషనల్ హైవేలపై మలుపులు, ఇరుకు రోడ్లు, కల్వర్టులు వరుస ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,535 బ్లాక్ స్పాట్‌‌‌‌‌‌‌‌లు గుర్తించగా, ఇందులో 326 ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ లోపాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా దేశంలో అత్యధిక బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. జాతీయ రహదారులపై అత్యధిక ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్‌‌‌‌‌‌‌‌లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌‌‌‌‌‌‌‌సభలో వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న హైవే నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌ వల్ల రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ సవాల్‌‌‌‌‌‌‌‌గా మారిందని తెలిపింది.

500 మీటర్ల పరిధిలో ఐదు కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే..

రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. యాక్సిడెంట్స్ అనాలిసిస్‌‌‌‌‌‌‌‌ డేటా ఆధారంగా రోడ్డుపై కనీసం 500 మీటర్ల మేర తరుచూ ఐదు కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఆ లొకేషన్‌‌‌‌‌‌‌‌ను ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌ పరిభాషలో బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తారు. ప్రమాదాలకు డిజైన్‌‌‌‌‌‌‌‌ లోపం, షార్ప్‌‌‌‌‌‌‌‌ కర్వ్స్‌‌‌‌‌‌‌‌, జంక్షన్లు, రోడ్డుపై పొరలు సరిగా లేకపోవడం తదితర కారణాలు ప్రధానమైనవిగా తేలుస్తారు. కాగా, 2,210 బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్స్‌‌‌‌‌‌‌‌తో ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌, ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు 1,661, తెలంగాణ 1,535, పంజాబ్ 1,407, పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లోని నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేస్‌‌‌‌‌‌‌‌లో 1,339 -ప్రమాదకర ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. 

నేషనల్ హైవేలపై లోపాలు..

థర్డ్‌‌‌‌‌‌‌‌ పార్టీ నిపుణులతో వివిధ దశల్లో డిజైన్, రోడ్డు నిర్మాణం, వాహనాల రద్దీ సహా ట్రాఫిక్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, రోడ్డు సేఫ్టీ ఆడిట్‌‌‌‌‌‌‌‌ల ద్వారా బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌లను పరిగణనలోకి తీసుకున్నారు. బ్లాక్ స్పాట్స్‌‌‌‌‌‌‌‌లో డిజైన్ లోపాలు, సైన్ బోర్డులు, తక్కువ లైటింగ్, ప్రమాదకర జంక్షన్లు, ట్రాఫిక్ నిర్వహణ సమస్యలుగా గుర్తించారు.హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులపై 54కు పైగా బ్లాక్‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌లు ఉన్నట్లు తేల్చారు. ఇందులో ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ –-సూర్యాపేట – విజయవాడ సహా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ –-జగ్దల్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌– ఓఆర్ఆర్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌– బీజాపూర్‌‌‌‌‌‌‌‌ హైవేలపై ఇరుకు రోడ్డు, అధిక ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌, రోడ్లపై మితిమీరిన గుంతలు, రోడ్ల నిర్వహణ లోపంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. వీటిలో లేన్ మార్కింగ్‌‌‌‌‌‌‌‌లు, రంబుల్ స్ట్రిప్‌‌‌‌‌‌‌‌ల వంటి స్వల్పకాలిక చర్యలు చేపట్టారు.

ప్రతిపాదనలకే పరిమితమైన రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రమాదాల నివారణకు జాతీయ, రాష్ట్ర రహదారులపై సుమారు 50 రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సూచన మేరకు అధికారులు గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 70 పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించారు. నేషనల్ హైవేలపై 22 రీజినల్‌‌‌‌‌‌‌‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు.

 ప్రతి 1,800 కిలోమీటర్లకు ఒక డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్యాలయం, 900 కిలోమీటర్లకు గ్రూప్‌‌‌‌‌‌‌‌ కార్యాలయం, 600 కిలోమీటర్లకు సబ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ కార్యాలయం, ప్రతి 300 కిలోమీటర్ల దూరంలో ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఉండేలా చూడాలన్నారు. కానీ ఇది ఇంకా ఆచరణకు నోచుకోలేదు. రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కలిగించడంలోనూ క్షేత్రస్థాయిలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఏటా నిర్వహించే వారోత్సవాలు తప్ప మిగతా సమయాల్లో రోడ్‌‌‌‌‌‌‌‌ సేఫ్టీని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.