మున్సిపోల్స్‎లో భారీ పోలింగ్‌.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి మేలు..?

మున్సిపోల్స్‎లో భారీ పోలింగ్‌.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరికి మేలు..?
  • 90% పైగా లోకల్ బాడీల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా
  •     పట్టణాలు తమకే అనుకూలమంటున్న బీజేపీ 
  •     ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్ 
  •     పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్​ పార్టీలు
  •     నిజామాబాద్, కరీంనగర్‎లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్


హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎప్పుడూ లేని విధంగా 73 శాతంపైగా పోలింగ్ నమోదుకావడంతో ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 50 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాదు.  కానీ ఈ స్థాయిలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తడం తమ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు ప్రజలిచ్చిన మద్దతుగా అధికార కాంగ్రెస్ భావిస్తోంది. 

రాష్ట్రంలోని 90 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పట్టణాల్లో తమ పార్టీకి ఓటర్ల నుంచి అనూహ్య స్పందన లభించిందని బీజేపీ విశ్లేషిస్తుండగా, ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అధికార పార్టీకే జై కొట్టాయి. 

మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ హవా నడవనుందని స్పష్టం చేశాయి. ప్రధానంగా 'వీ6 -వెలుగు' ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం..  మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు 85 నుంచి 95 దక్కుతాయని అంచనా. బీఆర్ఎస్ 15 నుంచి 20 స్థానాలకు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 5 చోట్ల కాంగ్రెస్, ఒకచోట బీజేపీ గెలుస్తాయని, మరోచోట కాంగ్రెస్ -బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తెలుస్తోంది. 

అయితే, నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీ మధ్య 'నువ్వా -నేనా' అన్నట్లుగా హోరాహోరీ పోరు సాగింది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ గట్టి పోటీని ఆశిస్తోంది. మరికొన్ని మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ ఎవరు గెలుస్తారన్నది అంచనా వేయడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్ ప్రభావం కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది.  

సెంచరీ అంచనాల్లో హస్తం పార్టీ

పట్టణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో పెరిగిన ఈ పోలింగ్ శాతం తమకే లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉన్నది. బుధవారం జరిగిన పోలింగ్ సరళిని లోతుగా విశ్లేషించుకుంటున్న అధికారపార్టీ నేతలు.. బూత్ స్థాయి లెక్కలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద తమ పార్టీ 100కు పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

 తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలన పట్ల మద్దతు తెలిపేందుకే పట్టణ ఓటర్లు వెల్లువెత్తారని విశ్లేషిస్తున్నారు. సీఎం రేవంత్​ సైతం ఐదు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంత్రులంతా పార్లమెంట్​సెగ్మెంట్ల పరిధిలో ఇన్​చార్జిలుగా వ్యవహరించి పోల్ మేనేజ్​మెంట్ చేశారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత స్పష్టంగా కనిపించిందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. 

బీజేపీ, బీఆర్ఎస్ నేతల్లోనూ ధీమా.. 

బీజేపీ కూడా ఫలితాలపై గట్టి నమ్మకంతో ఉంది. పట్టణ ప్రాంతాల్లో తమకు సహజంగా ఉండే పట్టుకు తోడు, ఈసారి క్షేత్రస్థాయిలో తమ పార్టీ పట్ల ప్రజల్లో అనూహ్య స్పందన కనిపించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రమే బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ తో పాటు కేంద్రమంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు.  ప్రధాని మోదీ చరిష్మా, స్థానిక అంశాలు కలిసి వస్తాయని, పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమేనని భావిస్తున్నారు. 

ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. బయట కనిపిస్తున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి తేడా ఉందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయని వారు చెప్తున్నారు. సైలెంట్ ఓటింగ్ తమకే పడిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని అంటున్నారు. 

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా 

'పల్స్ టుడే' సంస్థ జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికను లోతుగా పరిశీలిస్తే.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తున్నట్టు తెలుస్తోంది. నల్గొండ (17 మున్సిపాలిటీలు), ఖమ్మం (7 మున్సిపాలిటీలు) జిల్లాల్లోని మొత్తం స్థానాలను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయనుందని అంచనా. అలాగే రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ మెజార్టీ మున్సిపాలిటీలు హస్తం ఖాతాలో పడనున్నాయి. 

అయితే, బీఆర్ఎస్ పార్టీకి మెదక్ జిల్లాలో గట్టి పట్టు ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. అక్కడ   దాదాపు 10 చోట్ల గులాబీ జెండా ఎగురవేసే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వార్డుల వారీగా బీజేపీ గణనీయమైన ప్రభావం చూపినప్పటికీ, చైర్మన్ పీఠాలను దక్కించుకునే స్థాయి బలం మాత్రం కాంగ్రెస్‎కు, కొన్నిచోట్ల బీఆర్ఎస్‎కు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. 

నిజామాబాద్ (29 డివిజన్లు), కరీంనగర్ (25 డివిజన్లు) కార్పొరేషన్లు బీజేపీ ఖాతాలో పడతాయని తేల్చిచెప్పగా.. నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం, రామగుండం కార్పొరేషన్లలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను సులభంగా దాటేస్తుందని స్పష్టం చేసింది. ఈ మూడు ప్రధాన సర్వేలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గాలి వీస్తోందని అర్థమవుతోంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి చోట్ల మాత్రం బీజేపీ తన పట్టు నిలుపుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు

మున్సిపోల్స్ ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. ప్రధానంగా 'వీ6 -వెలుగు' ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించే దిశగా వెళ్తోంది. ఆ పార్టీకి ఏకంగా 85 నుంచి 95 మున్సిపాలిటీలు దక్కుతాయని అంచనా వేయగా.. బీఆర్ఎస్ 15 నుంచి 20 స్థానాలకు, బీజేపీ 2 నుంచి 5 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 

ఇక ఎంఐఎం 2 చోట్ల గెలిచే చాన్స్ ఉంది. రాష్ట్రంలోని 7 కార్పొరేషన్ల విషయానికొస్తే.. 5 చోట్ల కాంగ్రెస్ జండా ఎగురుతుందని, ఒకచోట బీజేపీ గెలుస్తుందని, మరోచోట కాంగ్రెస్ -బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు 'పీపుల్స్ పల్స్' సంస్థ సర్వే గణాంకాలు కూడా ఇదే తరహా ఫలితాలను విశ్లేషించాయి. కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 76 మున్సిపాలిటీలు, బీఆర్ఎస్ కు 29 నుంచి 36 స్థానాలు లభిస్తాయని, బీజేపీ 3 నుంచి 5 స్థానాల్లో గెలిచే వీలుందని అంచనా వేసింది. 

కార్పొరేషన్ల వారీగా చూస్తే.. రామగుండం, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాలను దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ హవా కొనసాగుతోందని, అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కంటే కమలనాథులే ఎక్కువ డివిజన్లలో గెలుస్తారని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.