హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా కార్మిక లోకం జంగ్ సైరన్ మోగించింది. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. కార్మికుల పొట్టకొడుతున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ సమర శంఖం పూరించింది. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం భారత్‌బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ, విద్యార్థి సంఘాలతోపాటు సంయుక్త కిసాన్ మోర్చా సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో కార్మికులు, రైతులు, ప్రజలు భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం ఏకపక్షంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచే ‘ వీబీ జీ రామ్ జీ చట్టం-2025’ను వెనక్కి తీసుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరుతున్నాయి. విద్యుత్ బిల్లు-2025, విత్తన బిల్లు-2025 ను రద్దు చేయాలని, రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె చేపడుతున్నారు. కాగా, సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ, ఇతర రవాణా రంగాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు
కార్మిక సంఘాల సమ్మెకు ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా మద్దతు తెలపనున్నాయి. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనల్లో పాల్గొనాలని పార్టీ ఆదేశించింది. మరోవైపు సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ, అమెరికా వాణిజ్య ఒప్పందాలకు తలొగ్గి రైతులు, కార్మికుల ప్రయోజనాలను మోదీ సర్కార్ తాకట్టు పెట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగే ర్యాలీలకు పార్టీ శ్రేణులు కదలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమ్మెకు మద్దతుగా జరిగే సమావేశాలు, ఊరేగింపులు, ప్రదర్శనల్లో సీపీఐ శ్రేణులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. కాగా, ఈ సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ నేత వీఎస్ రావు, ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మెలో భాగంగా ఇందిరా పార్క్ వద్ద జరగనున్న ధర్నాలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఐఎన్‌టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి పాల్గొనున్నారు.
