- రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రిడిటేషన్ మార్గదర్శకాలతో వృత్తిపరమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యోచిస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చిన్న చూపును ప్రస్తావించారు. ఆ జీవోను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త జీవోలో మార్పులు చేశామని వెల్లడించారు.
కొత్త జీవోపై కొందరు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ.. విలేకరులకు మాత్రమే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెబుతున్నారన్నారు. ఇందులో వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కూడా కోరవచ్చని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై సీఎంతోపాటు సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయన్నారు. ఇందుకు విరుద్ధంగా ఓ రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం విచారకరమని పేర్కొన్నారు.
