కీలక కేసులపై కేంద్రం పీటముడి!

కీలక కేసులపై కేంద్రం పీటముడి!
  • ఫార్ములా ఈ రేస్ కేసులో అర్వింద్​ కుమార్​పై రెండు సార్లు డీవోపీటీకి లెటర్.. అయినా  నో రెస్పాన్స్
  •     అంతకు ముందు కేటీఆర్​పై కేసుకు గవర్నర్ పర్మిషన్ కోసం 3 నెలలకు పైగా టైం
  •     కాళేశ్వరంపై సీబీఐకి రాని పర్మిషన్
  •     ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ప్రాసిక్యూషన్​కు గవర్నర్ అనుమతి తప్పనిసరి?
  •     న్యాయ సలహా తీసుకుంటున్న పోలీస్ అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా విచారణ చేయిస్తున్న కేసులకు కేంద్రం పీటముడి పెడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని చూస్తుంటే.. ఢిల్లీ పెద్దలు మాత్రం దర్యాప్తు సంస్థల కాళ్లకు బంధాలు వేస్తున్నారు. 

ఫార్ములా-ఈ రేస్ మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత కీలకమైన కేసులలో కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు రాకపోవడంతో విచారణలు ఆలస్యం అవుతున్నాయి. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నా, ప్రాసిక్యూషన్ (విచారణ) చేయడానికి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర గవర్నర్, కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ (డీవోపీటీ) నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరుగుతుంది. అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్లను రక్షించేందుకే లేఖలు రాసినా స్పందించకుండా దాటవేత ధోరణిని అవలంబిస్తోందని, కొన్నిటికి పర్మిషన్ ఇచ్చినట్లు చెబుతున్నా మిగతా చర్యల్లో ఆలస్యమయ్యేలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫార్ములా ఈ రేస్.. లేఖలకు స్పందన కరువు

ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా మళ్లించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌‌పై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా కేంద్రం సహకరించడం లేదు. ఈ కేసులో ఆయన్ను విచారించేందుకు (ప్రాసిక్యూషన్) అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం మూడు నెలల కిందట లేఖ రాసింది. అయితే నెలలు గడుస్తున్నా అటువైపు నుంచి ఉలుకూ పలుకూ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరోసారి రెండో లేఖ (రిమైండర్) రాసినా ఇప్పటికీ సమాధానం రాకపోవడం గమనార్హం. 

ఆలిండియా సర్వీస్ అధికారులపై విచారణ జరపాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అనే నిబంధనను అడ్డం పెట్టుకుని, ఢిల్లీ స్థాయిలోనే ఫైళ్లను తొక్కిపెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఐఏఎస్ అధికారిపై చర్యలకు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల, ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ లాంటి వారిపై విచారణ చర్యలకు కూడా తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

గతంలో కేటీఆర్‌‌పై విచారణకు అనుమతిలోనూ జాప్యం

కేంద్రం వైఖరి ఇలా ఉండటం ఇదే తొలిసారి కాదు. ఫార్ములా- ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి కోరిన సమయంలోనూ ఇలాంటి హైడ్రామానే నడిచింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై విచారణకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కాగా, ఆ ఫైల్ లోక్​భవన్ గడప దాటడానికి ఏకంగా మూడు నెలల సమయం పట్టింది. 

సాక్ష్యాధారాలు బలంగా ఉన్నా, ఏసీబీ నివేదికలు సమర్పించినా అనుమతి ఇవ్వడంలో జరిగిన ఈ అసాధారణ జాప్యం వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ జరిగింది. ఇప్పుడు అధికారుల వంతు వచ్చేసరికి కేంద్రం అదే తరహాలో వ్యవహరిస్తుండటంతో, కేసును నీరుగార్చడానికి వ్యవస్థీకృతమైన ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు వచ్చేలోపే నిందితులు న్యాయపరమైన రక్షణ పొందేలా ఉపయోగపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

కాళేశ్వరం.. సీబీఐకి అందని పర్మిషన్

మరోవైపు, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యిందని ఆరోపణలున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, ఎన్​డీఎస్ఏ రిపోర్ట్​తో పాటు అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి నెలలు గడుస్తున్నా, కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికీ స్పష్టమైన అనుమతి రాలేదు. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర, రుణాల మంజూరులో కేంద్రం పాత్ర కూడా ఉండటంతోనే సీబీఐ విచారణకు ఢిల్లీ పెద్దలు వెనుకాడుతున్నారన్న చర్చ జరుగుతున్నది. 

రాష్ట్రం లేఖ రాసినా స్పందించకపోవడం అంటే, పరోక్షంగా గత పాలకులకు కేంద్రం రక్షణ కవచం తొడుగుతోందన్నట్లేనని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీబీఐ ఎంట్రీ ఇస్తే తీగ లాగితే డొంక కదులుతుందని, ఢిల్లీ టు గల్లీ బంధాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్ర హోంశాఖ అనుమతిని పెండింగ్‌‌లో పెట్టినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్.. న్యాయ సలహాల్లో పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ గవర్నర్ అనుమతి వ్యవహారం పోలీసులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న పోలీసు అధికారులతో పాటు, వారికి ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ వంటి రాజకీయ నేతలను విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని తెలుస్తోంది. ప్రస్తుతం వారికి నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ భావిస్తున్నది. 

అయితే ఆ తరువాత ప్రభుత్వంలో ఉండి ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగం చేసినట్లు ప్రాసిక్యూషన్ చేసి చర్యలు తీసుకోవాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ కార్యాలయం నుంచి, లేదా కేంద్రం నుంచి అనుమతులు వెంటనే రావడం అంత సులభం కాదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 

దీంతో పీటముడి పడిన ఈ కేసులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? గవర్నర్ అనుమతి కోసం ఎదురుచూడాలా? లేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చార్జ్ షీట్లు దాఖలు చేయాలా? అన్న అంశాలపై సీనియర్ పోలీస్ అధికారులు న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతున్నారు.