- క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కార్తికే
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు
- ఎవరెస్ట్ అధిరోహించిన మేడ్చల్ మల్కాజ్గిరి బాలుడు
- సెవెన్ సమిట్స్ ఛాలెంజ్.. విజయవంతంగా పూర్తి
- ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 20 మందికి పురస్కారాలు ప్రదానం
న్యూఢిల్లీ, వెలుగు: క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు మేడ్చల్ మల్కాజ్‌గిరికి చెందిన విశ్వనాథ్ కార్తికే పడకంటికి ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ వరించింది. 2025లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత సెవెన్ సమిట్స్ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా కార్తికే రికార్డు సృష్టించాడు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శుక్రవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను కార్తికే అందుకున్నాడు. 24 గంటల్లో మౌంట్ ఎల్బ్రస్‌ను అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగానూ కార్తికే నిలిచాడు. 4 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. 6 ఖండాల్లో 20కి పైగా శిఖరాలను అధిరోహించాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. 2025లో 13 ఫౌండేషన్ నుంచి ‘టెన్సింగ్ నార్గే ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్నాడు. కాగా, వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 20 మందికి ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. చిన్నారుల సాహసాలు, విజ్ఞానం దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డులు.. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలందరిలో స్ఫూర్తి నింపుతాయని చెప్పారు.
ఇద్దరికి మరణానంతరం అవార్డులు
20 మంది చిన్నారుల్లో ఇద్దరు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరులను రక్షించినందుకు మరణానంతరం పురస్కారాలు వరించాయి. తమిళనాడుకు చెందిన బ్యోమా.. కరెంట్ షాక్‌కు గురైన 6 ఏండ్ల బాలుడిని కాపాడుతూ తన ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా, బిహార్‌కు చెందిన కమలేశ్.. దుర్గావతి నదిలో మునిగిపోతున్న చిన్నారిని రక్షిస్తూ తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అవార్డు అందుకున్న వారిలో 14 ఏండ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, ఆగ్రాకు చెందిన అజయ్ రాజ్, మహారాష్ట్రకు చెందిన అర్ణవ్ అనుప్రియ మహర్షి, ఏపీకి చెందిన పారా అథ్లెట్ శివాని సహా మరికొంతమంది చిన్నారులు ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జవాన్లకు నిరంతరం సేవలందించిన పంజాబ్‌కు చెందిన శ్రవణ్‌కు సామాజిక సేవ రంగంలో అవార్డు వరించింది. కాగా, మతోన్మాదం, టెర్రరిజానికి వ్యతిరేకంగా సాహిబ్‌జాదెల (సిక్కు మత గురువు గురు గోవింద్ సింగ్ కొడుకులు) త్యాగానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 26న సాహస బాలురకు బాల్ పురస్కారాలను ప్రదానం చేస్తుంటారు.
