- రైతులు నేచురల్ ఫార్మింగ్‌పై దృష్టిపెట్టాలి
- గతంలో రాష్ట్రానికి ప్రధాని వచ్చినా సీఎం వచ్చేవారు కాదు
- ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయడం మంచి పరిణామమని వ్యాఖ్య
- మంత్రి జూపల్లితో కలిసి రిమ్స్‌లో క్రిటికల్ కేర్ సెంటర్ ప్రారంభం
ఆదిలాబాద్, వెలుగు: పంటల సాగులో రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ‘‘ఎరువులు అతిగా వాడడంతో రోగాల పాలవుతున్నాం. కనీసం మన ఆరోగ్యం కోసమైన కెమికల్స్ లేకుండా పంటలు పండించాలి. నేచురల్ ఫార్మింగ్ పెరగాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్‌లో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 బెడ్స్ క్రిటికల్ కేర్ సెంటర్‌ను శుక్రవారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురల్ ఫార్మింగ్ ద్వారా దిగుబడి పెరుగుతుందని, దీంతో రైతులకు లాభదాయకంగానూ ఉంటుందని చెప్పారు.‘‘మార్చి వరకు పత్తి కొనుగోలు చేస్తాం. దళారులు ఇబ్బంది పెట్టినా రైతులు చైతన్యవంతులై ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా పత్తి అమ్మకాలు చేయడం అభినందనీయం” అని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్రంతో రాష్ట్రం కలిసొస్తున్నది..
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసివస్తున్నదని, ఇది మంచి పరిణామమని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘అభివృద్ధి విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసివస్తున్నది. గత ప్రభుత్వంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండేవి. అభివృద్ధి కార్యక్రమాల కోసం తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినా.. అప్పటి సీఎంకు తీరిక ఉండేది కాదు. మోదీ కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభానికి వస్తే అప్పటి సీఎం హాజరు కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అభివృద్ధి పనులు చేసుకోవడం మంచి పరిణామం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. విధానపరంగా విభేదాలుంటే నిరసన తెలియజేయవచ్చు.. కానీ అన్నింటినీ వ్యతిరేకిస్తూ పోతే దేశం ముందుకుపోదు’’ అని అన్నారు. ‘‘వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. ఆదిలాబాద్‌లోనూ నిర్మిస్తాం. సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీ పనులు పూర్తికాగానే మోదీ ప్రారంభిస్తారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాలు హైవేకు లింక్అవుతాయి. నాగ్‌పూర్– -మంచిర్యాల, మంచిర్యాల – విజయవాడ మధ్య కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టనున్నాం” అని తెలిపారు.
హెల్త్‌కు ప్రాధాన్యం ఇస్తున్నం: జూపల్లి
రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ‘‘మాతాశిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 800 కోట్లు మంజూరు చేశాం. కొత్తగా డాక్టర్లను, స్టాఫ్ నర్సులను నియమించాం” అని చెప్పారు. ఆదిలాబాద్ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు దండె విఠల్, కొమరయ్య, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య పాల్గొన్నారు.
త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్‌పోర్టు స్థలాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అడ్డంకులను తొలగించాలని అధికారులకు సూచించారు. కాగా, ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవనంలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచులను కిషన్ రెడ్డి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేండ్లు ప్రజలను కేసీఆర్ బానిసలుగా చూశారు. అందుకే ఆయన ఇప్పుడు ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి.. కేసీఆర్ తన కుటుంబాన్నే బంగారం చేసుకున్నారు. దోచుకున్న డబ్బుల కోసమే ఆయన కుటుంబసభ్యులు రోడ్డునపడి కొట్లాడుకుంటున్నారు” అని అన్నారు. ‘‘కేసీఆర్ పుణ్యామా అని మిగులు రాష్ట్రమైన తెలంగాణ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగింది. అప్పుడు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు పడితే వారు దోచుకుంటున్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు న్యాయం జరగలేదు. తెలంగాణను ముంచిన చరిత్ర ఈ రెండు పార్టీలదే” అని విమర్శించారు.
