- ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : శిశుమందిరాలు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భారతీయ సంస్కారాలను, విలువలను అందిస్తున్నాయని ఎంపీ డీకే అరుణ అభినందించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లోని అప్పనపల్లిలో నిర్వహించిన శ్రీ సరస్వతి విద్యాపీఠం పూర్వ విద్యార్థుల, ఆచార్యుల మహా సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద, ధనిక అనే భేదం లేకుండా విద్యను అందించాలనే లక్ష్యంతో ఇక్కడి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, ఈ పాఠశాలల్లో చదువుకున్న వారు నేడు ఉన్నత హోదాల్లో ఉండటం గర్వకారణమన్నారు. శిశుమందిరాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. శాంతి కుమార్ మాట్లాడుతూ, దేశభక్తి కలిగిన సమాజ నిర్మాణానికి శిశుమందిరాలు పునాది వేస్తున్నాయని తెలిపారు.
అనంతరం రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ, తెలంగాణలో బీజేపీని అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మద్దతుగా వెళ్తే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగిస్తున్నారని, బీజేపీ నేతలను, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు.
