కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అగ్ర నేత ముకుల్ రాయ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతోన్న ఆయనకు గుండెపోటు రావడంతో ఫిబ్రవరి 23న తెల్లవారుజామున 1:30 గంటలకు కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సుభ్రాంషు రాయ్ వెల్లడించారు. ముకుల్ రాయ్ అంత్యక్రియలు ఇవాళ(సోమవారం) జరుగుతాయని చెప్పారు. ముకుల్ రాయ్ మృతి పట్ల టీఎంసీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్న ముకుల్ రాయ్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించింది. అతను మనుషులను గుర్తించే సామర్థ్యాన్ని కూడా కోల్పోయాడు. కేవలం లిక్విడ్ రూపంలో ఉన్న ఆహారాన్నిమాత్రమే తీసుకునేవాడని చెప్పారు.
మమతా బెనర్జీకి నమ్మకస్తుడు
ముకుల్ రాయ్ తృణముల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడు. టీఎంసీలో రెండో అత్యంత శక్తివంతమైన నేతగా ముకుల్ రాయ్ కి పేరుంది. తన రాజకీయ చతురతకు "బెంగాల్ రాజకీయాల చాణక్య అని కూడా పిలువబడే రాయ్ 1998లో మమతా బెనర్జీతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 2011లో తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాల నుండి బెంగాల్‌ను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత, రాయ్ UPA 2 ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు. తరువాత ఆయన రైల్వే మంత్రిగా పనిచేశారు.
బీజీపీ నుంచి రిటర్న్
ముకుల్ రాయ్ 2019 లోక్‌సభ ఎన్నికలకు కేవలం రెండు సంవత్సరాల ముందు 2017లో బిజెపిలో చేరడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బెంగాల్‌లో బిజెపిని..అట్టడుగు నుంచి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో బిజెపి వ్యూహంలో కీలకమైన పాత్ర పోషించిన రాయ్ 2019లో 42 లోక్‌సభ స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకోవడంలో కీ రోల్ పోషించారు. రాయ్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టికెట్‌పై పోటీ చేసి కృష్ణానగర్ నుంచి గెలిచారు. అయితే రాష్ట్రంలో పార్టీ లోపల అతని ప్రభావం తగ్గడంతో చివరికి అతను తృణముల్ కాంగ్రెస్ గూటికి చేరారు.
