ఆగస్టు నాటికి లింక్ కెనాల్స్ పూర్తి ; ఎమ్మెల్యే మట్టా రాగమయి

ఆగస్టు నాటికి లింక్ కెనాల్స్ పూర్తి ; ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: వచ్చే ఆగస్టు నాటికి లింక్​కెనాల్స్​ను పూర్తి చేసి, పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. పెనుబల్లి మండలం రామచంద్రపురంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ కు ఆదివారం భూమిపూజ  చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్​వాళ్లు ప్రజాధనాన్ని కొల్లాగొట్టారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం విస్మరిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలోని 58,900 ఎకరాల్లో రెండు పంటలకు నీరందుతుందని చెప్పారు. రూ.326 కోట్లతో 309 కిలోమీటర్ల మేర కాల్వలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. యాతాలకుంట మేజర్ కాల్వ పూర్తి కావొచ్చిందన్నారు. కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రామారావు, తహసీల్దార్ వీరభద్ర నాయక్, ఎంపీడీవో అన్నపూర్ణ, సర్పంచ్ రిజ్వానా, మాజీ సర్పంచ్ కరీముల్లా, కేఎన్ఆర్ ప్రాజెక్టు మేనేజర్ జనార్ధన్, జీఎం జాషువా పాల్గొన్నారు.