- ఓరుగల్లులో లీగ్ విజేత భూపాలపల్లి
- రన్నరప్‍గా నిలిచిన హనుమకొండ జట్టు
వరంగల్/ ములుగు, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ ఉమ్మడి వరంగల్ ఫైనల్ విజేతగా భూపాలపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈ నెల 24 నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 క్రికెట్ లీగ్ మ్యాచులు నిర్వహించగా, శుక్రవారం జనగామ జిల్లా వంగాలపల్లిలోని వరంగల్ జిల్లా క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో భూపాలపల్లి, హనుమకొండ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍గా ఎం.తిరుపతి నిలిచారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వర్‍రావు, ఆర్.రఘురాం, తోట రాము ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు మెమోంటోలు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఓరుగల్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రికెట్ క్రీడకారులను ప్రోత్సహించడంలో కాకా కుటుంబం ఏండ్ల తరబడిగా ముందుంటోందన్నారు.
ఓరుగల్లులో గడిచిన మూడు రోజులుగా వరంగల్ మొగిళిచర్ల, ములుగు జిల్లా జాకారం, వంగాలపల్లిలో 16 మ్యాచులు నిర్వహించామన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా విన్నర్‍గా భూపాలపల్లి, రన్నరప్‍గా హనుమకొండ జట్లు నిలిచాయన్నారు. క్రికెట్ లీగ్ నిర్వహణలో భాగస్వాములుగా కాకా మెమోరియల్ ట్రస్ట్, విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ లీగ్ మ్యాచ్లో భాగంగా మొదట ములుగులో నిర్వహించిన మ్యాచుల్లో మహబూబాబాద్, ములుగు జట్లు తలపడగా, మహబూబాబాద్ జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍గా సాయికుమార్ నిలిచాడు.
స్టేట్ లెవల్‍కు ఎంపికైన 'ఓరుగల్లు' జట్టు..
కె.ప్రదీప్ (హనుమకొండ), కె.రోహిత్ (హనుమకొండ), చంద్ర (వరంగల్), ఎం.శివరామకృష్ణ (జనగామ), పి.రిశ్యాంత్ (వరంగల్), జి.పవన్‍రాజ్ (హనుమకొండ), ఎన్.రాహుల్ (వరంగల్), ఎస్.ఆదర్శ్ (భూపాలపల్లి), జె.పర్ధీపన్ (హనుమకొండ), ఏ.నాగరాజు (భూపాలపల్లి), త్రిశూల్ (హనుమకొండ), సాయికుమార్ (మహబూబాబాద్), ఎస్‍డీ.రియాజ్ (ములుగు), ఆశ్లేష్ వర్మ (హైదరాబాద్), కే.శ్రీ అఖిలేశ్ (హైదరాబాద్), ఆకాశ్ కుర్రె (హైదరాబాద్), ఆవుల నిక్షిత్ (హైదరాబాద్), అరుష్ పావులేచి (హైదరాబాద్) ఎంపికయ్యారు.
