హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న రూ. కోట్ల విలువైన 77.30 ఎకరాలు దేవల్ బాలాజీ ఆలయానివేనని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే నంబర్లు 10, 29, 31, 33, 230 నుంచి 238, 273, 274, 275, 366లోని ఈ భూములకు సంబంధించి 2006 సెప్టెంబర్ 22న జిల్లా జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ (ఓఆర్‌సీ) ఉత్తర్వులు చట్టబద్ధమేనని వెల్లడించింది.
శేరి నారాయణరెడ్డి మరో 21 మంది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ విచారించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ.. ఇవి పట్టా భూములని, తాతముత్తాతల నుంచి తన క్లయింట్ ఆధీనంలో ఉన్నాయని, ఈనాం భూములు కావని వెల్లడించారు.
అనంతరం రెవెన్యూ, దేవాదాయ శాఖల తరఫు న్యాయవాదులు కాట్రం మురళీధర్ రెడ్డి, భూక్యా మంగీలాల్ నాయక్ వాదిస్తూ.. ఈ భూములు ఆలయానికి చెందిన ఈనాం భూములేనని, పిటిషనర్లు కేవలం కౌలుదారులు మాత్రమేనని, 1954–55 నుంచి 1997–98 వరకు పహాణీల్లో ఆలయం పేరిటే ఉన్నాయని వివరించారు.
ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకొన్న న్యాయమూర్తి.. ఈ భూములు ఆలయానివేనని తేల్చి పిటిషన్లను కొట్టివేశారు. భూములపై హక్కులు ఉన్నాయని పిటిషనర్లు భావిస్తే ఎండోమెంట్స్ ట్రిబ్యునల్‌లో వివాదాన్ని తేల్చుకోవాలని సూచించారు.
స్వీపర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ చేయండి
జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ శాఖల్లో గత 30 ఏండ్లుగా స్వీపర్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో అధికారులు విఫలం కావడాన్ని తప్పుబట్టిన కోర్టు.. స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెక్కించి జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు చెల్లించాలని స్పష్టం చేసింది.
30 ఏండ్లుగా స్వీపర్లుగా పని చేస్తున్నా.. తమ సర్వీస్‌ను క్రమబద్ధీకరణ చేయలేదని పేర్కొంటూ అశోక్ మరో 38 మంది వేసిన పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ల అడ్వకేట్ వాదిస్తూ.. స్వీపర్ల సర్వీసును పరిగణనలోకి తీసుకొని చివరి గ్రేడ్ అయిన అటెండర్ లేదా వాచ్‌మెన్ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేయాలనే అభ్యర్థనలను అధికారులు అమలు చేయలేదన్నారు.
సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన తీర్పు మేరకు 10 ఏండ్ల తాత్కాలిక సర్వీసు పూర్తయిన వాళ్ల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు.. స్వీపర్ల సర్వీసును క్రమబద్ధీకరణ కోసం తగిన ఆధారాలతో ఆఫీసర్లకు తిరిగి వినతి పత్రాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది.
అలా అందుకున్న వినతిపత్రాలను అధికారులు పరిశీలించాక స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెక్కించి, వేతన ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లను చెల్లించాలని తీర్పు వెలువరించింది.
