హైదరాబాద్: మూసీ అభివృద్దిపై కీలక ప్రకటన చేసింది మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్. మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. ఫేజ్ 1 లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 9.2 కిలోమీటర్లు, ఫేజ్ 2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల మేర మూసి పరిధిలోని భూసేకరణకు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, గోల్కొండ మండలాలు, రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండల పరధిలో భూసేకరణకు అక్విజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ప్రాంతాల్లో మొత్తం సుమారు 50 ఎకరాలకు పైగా భూసేకరణ చేయనున్నారు. భూమి యజమానులకు మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇచ్చేందుకు మూసీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిద్దమైంది. తమ హక్కుల పత్రాలైన పట్టా పాసుపుస్తకాలు,ఆధార్, బ్యాంక్ వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏవైన అభ్యంతరాలుంటే నిర్ణీత సమయంలో తెలియజేయాలని కోరింది.
భూసేకరణ చట్టం 2013 నిబంధనల ప్రకారం..సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితా ప్రకటించింది మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్,మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసి అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గండిపేట నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధి,14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో దశలవారీగా 55 కిలోమీటర్ల మూసీ అభివృద్ధి జరుగుతుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అనేది తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని 55 కి.మీల మూసీ నది కారిడార్‌ను సుందరీకరించి, కాలుష్య రహితంగా మార్చేందుకు చేపట్టిన భారీ ప్రాజెక్టు. సుమారు రూ4వేల100 కోట్ల అంచనా వ్యయంతో (ADB రుణంతో), మురికినీటిని శుద్ధి చేయడం, పర్యాటక ప్రాంతాలు, గాంధీ సరోవర్, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, వాటర్ స్పోర్ట్స్ వంటి ఆధునిక వసతులతో ఈ ప్రాజెక్టును రూ. 55 కి.మీల పొడవునా, ఐదు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు.
