న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ మీటింగ్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అగ్రనేతలు ప్రియాంక, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు.
అలాగే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్పు విషయంలో దేశవ్యాప్త పోరాటం, ఓట్ చోరీ, ఇతర అంశాలపై చర్చించనున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఇతరత్రా కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం..
సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకుదుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం తెలంగాణలోని పెండింగ్ అంశాలపై సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అవుతారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ పాలన, త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపిక, ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ అంశాలపై అధిష్టానం పెద్దలను కలవనున్నట్లు తెలిసింది.
అనంతరం 28న ఆదివారం తిరిగి రేవంత్ హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు, రాష్ట్రం నుంచి ఈ సమావేశంలో పాల్గొనేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ మెంబర్ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు భోపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు.
