పీజీ సీట్ల భర్తీ గడువు పెంపుపై వివరణ ఇవ్వండి..కేంద్రానికి హైకోర్టు ఆదేశం

పీజీ సీట్ల భర్తీ గడువు పెంపుపై వివరణ ఇవ్వండి..కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా పీజీ మెడికల్‌ డిగ్రీ, డిప్లొమా సీట్ల భర్తీకి అడ్మిషన్స్ గడువు పెంపునకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కేంద్రంతోపాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్‌ఎంసీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పీజీ అడ్మిషన్స్ గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 377, కన్వీనర్‌ కోటా 124, మేనేజ్‌మెంట్‌ కోటా 252 సీట్ల భర్తీ నిమిత్తం ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీ మేనేజ్‌మెంట్‌అసోసియేషన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్‌ ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ పీజీ అడ్మిషన్లకు అర్హత మార్కులను సడలించాలంటూ యూనివర్సిటీకి అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసిందన్నారు.

కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్‌ జనరల్‌ బి.నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అర్హత పర్సంటైల్‌ తగ్గింపు అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి పర్సంటైల్‌ అంశంపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత రావాల్సి ఉందని, దీంతోపాటు కేంద్రం, ఎంసీఐల వివరణ నిమిత్తం విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తున్నామని పేర్కొంది.