ఉద్యోగులను వారి పోస్టుల్లోనే కొనసాగించండి..నిమ్స్‌‌‌‌ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం

ఉద్యోగులను వారి పోస్టుల్లోనే కొనసాగించండి..నిమ్స్‌‌‌‌ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నిమ్స్‌‌‌‌లో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ చేసిన సమయంలో వారు ఏ పోస్టుల్లో ఉన్నారో.. ఆ పోస్టుల్లోనే కొనసాగించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. వారంలోగా గత ఉత్తర్వులు అమలు చేయాలని లేదంటే ఏప్రిల్‌‌‌‌ 10న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిమ్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ను ఆదేశించింది. ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ కింద నియమితులైన వారిని క్రమబద్ధీకరించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై 2023లో కె.పాపిరెడ్డి మరో 29 మంది హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ టి.మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు.

ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సర్వీసులో చేరిన వారికి వేతనాలను చెల్లిస్తున్నామని, అయితే అవసరాన్ని బట్టి పని కేటాయింపు ఉంటుందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. నైపుణ్యం ఉన్న వారిని తక్కువ హోదాల్లో నియమిస్తున్నారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు. పిటిషనర్లు ఉన్న హోదాల్లోనే క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు.