తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: తెలంగాణ సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్‌‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు చెప్పారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌‌లోని గిరిజన సంక్షేమ భవన్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో కుట్టు మిషన్ల శిక్షణ స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంక్‌‌ లింకేజీ లోన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా చేయడమే కాకుండా, వారిని వ్యాపారవేత్తలుగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాటారం, మంథని ఏరియాల్లో గార్మెంట్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని, అగరువత్తుల తయారీపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.

మహిళలు నాణ్యమైన ఉత్పత్తులు తయారుచేసినప్పుడే వాటికి మంచి మార్కెట్‌‌ లభిస్తుందని, తద్వారా లాభాలు పొందొచ్చని చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే పెట్రోల్‌‌ బంక్‌‌ ఏర్పాటు చేస్తామని, వాటి నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని చెప్పారు. 

వదినపల్లి, నాచారం ప్రాంతాల్లో సోలార్‌‌ పవర స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాలు, గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహిస్తామన్నారు. మే నాటికి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌‌ రాహుల్‌‌ శర్మ, ఎస్పీ సంకీర్త్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ రాజబాబు, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ విజయలక్ష్మి, డీఆర్డీవో బాలకృష్ణ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు దండు రమేశ్‌‌, సర్పంచ్‌‌ హసీనా భాను పాల్గొన్నారు.