ప్రజల పక్షాన నిలబడే వారికే గుర్తింపు: సీపీఐ జాతీయ నేత కె.నారాయణ

ప్రజల పక్షాన నిలబడే వారికే గుర్తింపు: సీపీఐ జాతీయ నేత కె.నారాయణ

పాల్వంచ, వెలుగు: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజా ప్రతినిధులు ప్రజల పక్షాన నిలబడినప్పుడే వారికి గుర్తింపు వస్తుందని సీపీఐ జాతీయ నేత డాక్టర్‌‌ కె.నారాయణ అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, కార్పొరేషన్‌‌, మున్సిపల్‌‌ ఎన్నికల్లో గెలిచిన సీపీఐ ప్రజాప్రతినిధులకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శిక్షణా తరగతులు నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ... యుద్ధ ప్రభావంపై భారతదేశంపై కూడా పడిందని, దీని కారణంగానే గ్యాస్‌‌, నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యులను సైతం గౌరవ ప్రజాప్రతినిధులుగా నిలిపిన చరిత్ర కమ్యూనిస్ట్‌‌ పార్టీలకే దక్కుతుందన్నారు. ప్రొఫెసర్లు కోదండరాం, హరగోపాల్‌‌ మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు రాజ్యాంగానికి లోబడి జవాబుదారీ పాలనను అందిస్తూ, ప్రజల హక్కులను రక్షించాలని సూచించారు. 

కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు రాజకీయ దృక్పథంతో పాటు ప్రత్యేక లక్ష్యం ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌‌కే.సాబీర్‌‌ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్‌‌ మేయర్‌‌ గణేశ్‌‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, ముత్యాల విశ్వనాథం, కల్లూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.