ఉచిత పథకాల అంశం భారత రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో సినిమా నటుడు విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన కొన్ని ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సంక్షేమం అనే సూత్రం రాజ్యాంగబద్ధమైనదే అయినప్పటికీ ‘ఉచితాలు’ అనే రూపంలో అమలవుతున్న కొన్ని కార్యక్రమాలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ పరిణామాన్ని సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ, రాజకీయ, న్యాయం లాంటి వివిధ కోణాల నుంచి విశ్లేషించడం అవసరం.
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలను సామాజిక న్యాయం సాధించడానికి ప్రేరేపిస్తాయి. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య రంగాల్లో పథకాలను ప్రవేశపెట్టాయి. ఉదాహరణకు ఉచిత ధాన్యం, రైతులకు నేరుగా నగదు బదిలీలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వంటి చర్యలు సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ఉపశమనం కలిగించాయి.
ఉచితాలు ఆర్థికంగా స్థిరమైనవా ?
సామాజిక కోణంలో రెండు విధాల ప్రభావం కనిపిస్తుంది. ఒకవైపు పేదలకు కనీస భద్రత కలుగుతుంది. మరోవైపు నిరంతరం ఉచితాలపై ఆధారపడే మనస్తత్వం పెరగవచ్చు. స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి తగ్గిపోవచ్చు. ఇది సమాజంలో ఉత్పాదకత తగ్గడానికి దారితీయవచ్చు. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజం కాదని కూడా చెప్పాలి. లక్ష్యత పథకాలు సరైనవిధంగా అమలైతే సోషల్ మొబిలిటీ పెరుగుతుంది. ఇక న్యాయకోణంలో.. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు సైతం పలుమార్లు ఉచితాల అంశంపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయనే వాదనలు వినిపించాయి. కోర్టు నేరుగా అన్ని ఉచితాలను నిషేధించలేదు. కానీ, ఆర్థిక బాధ్యత, పారదర్శకత, ఎన్నికల ప్రక్రియలో సమాన పోటీ అవసరాన్ని ప్రస్తావించింది. ఎన్నికల ప్రకటనలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం పాత్రను కూడా చర్చించింది. ఉచితాలు రాజ్యాంగ విరుద్ధమా కాదా అనే ప్రశ్న కంటే, అవి ఆర్థికంగా స్థిరమైనవా? ప్రజాస్వామ్య విలువలకు అనుకూలమా? కాదా అనే ప్రశ్నలపై కోర్టు దృష్టి పెట్టింది. అందుకే పలుమార్లు సుప్రీంకోర్టు వివిధ రాజకీయ పార్టీలు సంక్షేమం ముసుగులో ఉచితాలు ఇస్తూ, స్వార్ధ రాజకీయాలపై ఘాటుగానే స్పందిస్తూ పలుమార్లు అనేక సూచనలు చేసింది. అయినా ఈ ప్రభుత్వాలలో చలనం మాత్రం రావట్లేదు.
ఆర్థిక స్థిరత్వంపై అప్పుల ప్రభావం
రాష్ట్రాలు తమ రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రకారం పథకాలు రూపొందిస్తాయి. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్రాల అధిక అప్పులు జాతీయ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపితే అది సమగ్ర సమస్యగా మారుతుంది. మొత్తానికి, ఉచిత పథకాలు స్వభావంలో చెడ్డవికావు. కానీ, అవి ఎలా, ఎందుకు, ఎంతవరకు అమలవుతున్నాయి అన్నదే ముఖ్యమైన అంశం. పారదర్శకత, ఆర్థిక బాధ్యత, న్యాయ పరిరక్షణ, ప్రజల అవగాహన..ఈ నాలుగు అంశాల సమతుల్యతను తీసుకురావాలి.
ఓటు బ్యాంక్ రాజకీయాలు
సంక్షేమ రాష్ట్రం అనే భావన ప్రకారం ప్రభుత్వం ప్రజలకు కనీస జీవన ప్రమాణాలు కల్పించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అయితే సంక్షేమం, ఉచితాల మధ్య గీత మసకబారినప్పుడు ఉత్పాదకతను పెంచే పెట్టుబడులు (విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి) దీర్ఘకాల లాభాలను ఇస్తాయి. కానీ, ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల ముందు ప్రకటించే ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, నేరుగా నగదు పంపిణీ వంటి చర్యలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నాయనే అభిప్రాయం పెరిగింది. దీనిని ఓటు బ్యాంక్ రాజకీయాలు అని వ్యవహరిస్తారు.
ప్రజల ఆర్థిక అసురక్షితతను రాజకీయంగా ఉపయోగించుకోవడం ద్వారా దీర్ఘకాల విధానాల కంటే తక్షణ లాభాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఒక ప్రమాదకర ధోరణిగా మారింది. ఇక ఆర్థిక కోణంలో చూస్తే అధిక ఉచితాలు ప్రభుత్వ బడ్జెట్‌పై భారీ ఒత్తిడిని కలిగిస్తాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైతే ఆర్థిక లోటు పెరుగుతుంది. దీని ఫలితంగా ప్రభుత్వాలు అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులపై వడ్డీ భారం పెరిగితే అది భవిష్యత్ తరాలకు ఆర్థిక భారంగా మారుతుంది.
అమ్జాద్ మియా న్యాయవాది
