మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి

కామేపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి చివరి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. గత ప్రభుత్వం డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్లను కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఆ హామీని నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. 

ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో గత ప్రభుత్వం అసంపూర్తిగా ఉంచిన డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్ల పనులను పూర్తి చేసి పంపిణీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్లలో లక్ష ఇండ్లు కూడా కట్టలేదని, తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. ఏప్రిల్‌‌లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, అర్హులైన పేదలందరికి ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు.

ఊటుకూరు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ముచ్చర్ల, పింజరమడుగు గ్రామాల్లో డబుల్‌‌ బెడరూం ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌‌ సుధాకర్‌‌, రాష్ట్ర అగ్రికల్చర్‌‌ కమిషన్‌‌ డైరెక్టర్‌‌ రాంరెడ్డి గోపాల్‌‌రెడ్డి పాల్గొన్నారు.