హైదరాబాద్: హైదరాబాద్లో R&B ఈఎన్సి మోహన్ నాయక్ ఇంటితో పాటు ఏక కాలంలో 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీలపై.. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం నుంచి మోహన్ నాయక్ ఇంట్లో సోదాలు జరుపుతున్నామని చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇప్పటివరకు 60 లక్షల నగదు, 10 తులాల గోల్డ్ బిస్కెట్స్, 35 మద్యం సీసాలు లభించాయని వెల్లడించారు. మోహన్ నాయక్ అక్రమాస్తులపై 16 బృందాలు తనిఖీ చేస్తున్నాయని, ఈరోజు (మంగళవారం) సాయంత్రం వరకు మరిన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.
ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్( ఈఎన్సీ)గా మోహన్ నాయక్ సెప్టెంబర్ 2025లో నియమితులయ్యారు. గతంలో.. స్టేట్ రోడ్స్ చీఫ్ ఇంజినీర్గా, ఆర్డీసీ (రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) ఎండీగా మోహన్ నాయక్ పనిచేశారు. ప్రభుత్వం ఆయనకు ఈఎన్సీగా ఆయనకు పదోన్నతి కల్పించింది.
అయితే.. R&B ఈఎన్సిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాక ముందే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. మోహన్ నాయక్ పై అవినీతి ఆరోపణల రావడంతో తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయం ఆయన ఇల్లు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు చేసింది.
