తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాన్ని స్టార్ హీరో విశాల్ బహిరంగంగానే తప్పుబట్టారు. రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధితో పాటు కీలకమైన ఫిల్మ్ టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ శాఖను విజయ్ కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై నటుడు విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమ శాఖను రాజ్‌మోహన్‌కు అప్పగించడం నిరుత్సాహపరిచిందని విశాల్ అన్నారు. సినిమా రంగంతో విజయ్‌కు దశాబ్దాల అనుబంధం ఉందని.. కాబట్టి తమిళ చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి విజయ్ స్వయంగా ఆ శాఖను ఉంచుకుంటే బాగుండేదని సూచించారు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని, దీనికి తక్షణ సంస్కరణలు కావాలన్నారు. ఒకే భారతదేశం, ఒకే పన్ను ఉన్నా.. తమిళనాడులో మాత్రం ద్వంద్వ పన్ను విధిస్తున్నారని, స్థానిక సంస్థల పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చిన్న బడ్జెట్ చిత్రాల సబ్సిడీలను పెంచాలని కోరారు.
అయితే విశాల్ వ్యాఖ్యలపై నటుడు అరుణ్ విజయ్.. విశాల్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నత నిర్ణయాలలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని కోరారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సీఎం విజయ్‌కు బాగా తెలుసని, ఆయన నిర్ణయాలను గౌరవించి, తొందరపడి ఏ నిర్ధారణకూ రాకుండా ఫలితాల కోసం వేచి చూడాలని పిలుపునిచ్చారు.
