పని దొరక్కపోవడంతో రోజంతా పడిగాపులు

పని దొరక్కపోవడంతో రోజంతా పడిగాపులు

హైదరాబాద్, వెలుగు: రెక్కాడితే కానీ డొక్కాడని అడ్డా కూలీల బతుకులు ఆగమైతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్​లో సిటీలో ఉన్న అడ్డా కూలీలంతా సొంతూళ్లకు వెళ్లారు. అక్కడా పని దొరక్కపోవడంతో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ సిటీకి వచ్చారు. మొన్నటి వరకూ కాస్తో కూస్తో పని దొరకడంతో ఉపాధి పొందగా ఇప్పుడు పని లేక ఇబ్బంది పడుతున్నారు. కరోనాకు ముందు సిటీలో 3 లక్షల మంది వరకు అడ్డా కూలీలు ఉండగా, ప్రస్తుతం 4 లక్షలకుపైగా పెరిగినట్లు భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. దీంతో అడ్డా మీదకు వచ్చిన అందరికీ పని దొరకడం లేదు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా కూలీలు పనుల కోసం వెయిట్ చేస్తున్నారు. అయినా పని దొరక్కపోవడంతో నిరాశతో ఇంటికి వెళ్తున్నారు.

ఇలా కొంతమందికి వారంలో మూడు, నాలుగు రోజులు మాత్రమే పని దొరుకుతుంటే మరికొందరికి రెండు, మూడ్రోజులు మాత్రమే ఉపాధి ఉండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక కు చెందిన కొందరు కూలీలు మాత్రమే పనికోసం సిటీకి వచ్చేవారు. ప్రస్తుతం బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర  రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. గ్రేటర్​లో  మొత్తం 300కు పైగా కూలీల అడ్డాలు ఉండగా, ఒక్కో చోట 300 నుంచి వెయ్యి మందికిపైగా కూలీలు పని కోసం ఎదురుచూస్తున్నారు. 

సొంతూళ్లకు వెళ్లినా ఆర్ధిక ఇబ్బందులే..

కరోనా టైమ్​లో ఇక్కడ ఉండలేక ఎంతో మంది కూలీలు వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ కొన్నాళ్ల పాటు ఉండిపోయారు. ఎకరం, అర ఎకరం భూములున్న వారు 
వ్యవసాయం చేసినా గిట్టుబాటు కాకపోవడంతో మళ్లీ తిరిగి సిటీకి వచ్చినట్లు చెబుతున్నారు. ఏడాది పాటు గ్రామాల్లో ఉంటే  అప్పులు తప్ప ఇంకేం మిగల్లేదని.. ఇక్కడ కూలీ పని చేసుకుందామని వచ్చినట్లు చెబుతున్నారు. పొలం పనుల కోసం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లలో ఎక్కువగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. నిత్యావసరాల రేట్లు అమాంతం పెరిగి పోవడంతో ఎక్కడ బతకాలన్న ఖర్చులు అదే విధంగా ఉన్నాయి. ఓ పక్క పనులు లేకపోవడం, మరో పక్క ఖర్చులు పెరగడంతో మళ్లీ సిటీ బాట పట్టినట్లు కూలీలు చెబుతున్నారు.

తక్కువ కూలి ఇచ్చినా ...

అడ్డాలపై కూర్చుంటున్న కూలీలకు పని దొరక్క పోవడంతో  తిరిగి ఇంటికి వెళ్లలేక కొందరు తక్కువ కూలి అయినా సరే వెళుతున్నారు.ముషీరాబాద్, బంజారాహిల్స్, లంగర్ హౌస్, టోలిచౌకి, నాంపల్లి, హయత్ నగర్, ఉప్పల్, ఎల్ బీనగర్, బాలాపూర్​ చౌరస్తా లాంటి ప్రాంతాల్లో  వీరి అడ్డాలు ఎక్కువగా ఉన్నాయి.  ప్రస్తుతం అడ్డాకూలీల్లో మగవారికి రోజుకు రూ.800, మహిళలకు రూ.600 నుంచి రూ.700 వరకు వస్తున్నట్లు వారు చెబుతున్నారు. కొందరు రూ.400 నుంచి రూ.600 కూలి తీసుకొని కూడా పనులకు పోతున్నట్లు తెలిపారు.  కానీ ప్రస్తుతం  ఖర్చులు పెరగడంతో తక్కువ కూలీకి వెళ్తే గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లేబర్​ కార్డుతో ప్రయోజనం

అడ్డా కూలీలుగా ఎంతో మంది పనిచేస్తున్నా నేటికీ చాలామంది పేర్లు  కార్మిక శాఖలో రిజిస్ట్రేషన్ కాలేదు. రిజిస్ట్రేషన్​పై అవగాహన కల్పించడంతో పాటు కార్మిక గుర్తింపు కార్డు తీసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి తెలియజేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కానీ అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 60 ఏండ్లలోపు కూలీలు రేషన్​కార్డుతో పాటు  ఇక్కడి అడ్రెస్​ కోసం వారు ఉంటున్న ఇంటి కరెంట్ బిల్లు తీసుకొని మీ సేవలో రూ.110 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. లేబర్ కార్డు ఉంటే ప్రమాదంలో కూలీ మరణిస్తే రూ. 6 లక్షల 30 వేలు,  సహజ మరణమైతే రూ.1 లక్షా 30 వేలు, కూతురి పెళ్లికి  రూ.30 వేలు కార్మిక శాఖ తరపున అందుతుందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం అడ్డా కూలీలను ఆదుకోవాలి. కార్మిక శాఖలో అందరి పేర్లు రిజిస్ట్రేషన్​ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి లేబర్​ కార్డుతో భరోసా కల్పించాలి. ప్రమాద, సహజ మరణంతో పాటు కూతురి పెళ్లికి ఇస్తున్న డబ్బును పెంచాలి. సిటీలోని అన్ని చోట్లా ప్రత్యేకంగా అడ్డాలను ఏర్పాటు చేయాలి. 

- మోహన్, భవన నిర్మాణ కార్మిక సంఘం(సీఐటీయూ) సిటీ సెక్రటరీ 

పొలం పని చేసేందుకు నీళ్లు లేక ..

నాది వికారాబాద్ . పదేళ్ల నుంచి సిటీలో కూలీ పనిచేస్తున్న. కరోనా టైమ్​లో ఊరికి పోయి వ్యవసాయం చేసిన. నీళ్లు లేకపోవడంతో గిట్టుబాటు కాలేదు. దీంతో కుటుంబసభ్యులను ఊళ్లోనే ఉంచి నేనొక్కడిని మళ్లీ సిటీకి వచ్చి పని చేస్తున్న. కానీ ఇక్కడ కూడా రోజూ పని దొరకడం లేదు. ఒక రోజు దొరికితే మరో రోజు ఉండట్లేదు.

- బాలప్ప, అడ్డా కూలీ, లంగర్ హౌస్