- బండి సంజయ్‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
- కేంద్రం నుంచి నిధులు తెచ్చి చూపించాలని సవాల్
హైదరాబాద్, వెలుగు: మతం పేరు చెప్పుకొని బతకుడు తప్ప కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి మరేమీ చేతకాదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హిందువుల పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఇవ్వడం లేదన్న బండి సంజయ్ ఆరోపణలపై సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలో వందల కోట్లతో జరుగుతున్న ఆలయాల పునర్నిర్మాణం బండి సంజయ్‌కు, బీజేపీ నేతలకు ఎందుకు కన్పించడం లేదని నిలదీశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలోని వేములవాడ, భద్రాచలం, బాసర, యాదాద్రి వంటి దేవాలయాల పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న వందల కోట్ల నిధులతో అక్కడ అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
హైందవ ధర్మాన్ని కాపాడడం కోసమే ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నాం. రాబోయే గోదావరి పుష్కరాల కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశాం’’ అని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్నట్లుగా దేవాలయాల పునర్నిర్మాణం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతున్నదా చెప్పాలన్నారు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టే విధానం కాంగ్రెస్ పార్టీది కాదని, తమది సెక్యులర్ పార్టీ అని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. వట్టి మాటలు కట్టిపెట్టి.. చేతనైతే కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చి రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాలని సవాల్ విసిరారు.
