తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా తర్వాత.. అదే బాటలో సీనియర్ లీడర్లు పార్టీని వీడుతున్నారు. లేటెస్టుగా 2026 జూన్ 05న.. పార్టీ వైస్ ప్రసిడెంట్ కరు నాగరాజన్ బీజేపీకి రాజీనామా చేశారు. తన వైస్ ప్రసిడెంట్ పదవికి రాజీనామాచేసిన ఆయన.. పార్టీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపనున్నట్లు తెలిపారు. అన్నామలైని చెన్నై ఎయిర్ పోర్టులో కలిసిన ఆయన.. ఆయనకు మద్ధతుగా ఆయనతోనే ఉంటానని ప్రకటించారు.
మరోవైపు స్టేట్ సెక్రటరీ సుమతీ వెంకటేష్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ వీడుతున్నందుకు చాలా బాధపడుతున్నట్లు తెలిపారు.
తమిళ రాజకీయాల్లో నాగరాజన్ ప్రముఖ పేరున్న నేత. టీవీ డిబేట్లలో పార్టీ వాయిస్ ను వినిపిస్తూ పాపులర్ అయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మైలపూర్, 2017 లో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు చోటా భారీ తేడాతో ఓడిపోయారు. 2017 బైపోల్స్ లో ఏఎంఎంకే చీఫ్ దినకరన్ గెలవగా.. నాగరాజన్ నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.
This is my humble intimation to all 👃👃👃 pic.twitter.com/mHpAtDHNml
— Sumathi Venkatesh (மோடியின் குடும்பம்) (@SumathiVenkat18) June 5, 2026
- అన్నామలై రాజీనామా:
తమిళనాడు బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ద్రవిడ రాజకీయాలలో బీజేపీకి ఆశాకిరణంలా కనిపించిన అన్నామలై.. అక్కడ ఊహించినంత ఊపు తేలేకపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినందుకా లేక కాశాయ రాజకీయాలు అక్కడ నడవటం లేదనో కానీ.. సొంత కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైన అన్నమలై..రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆయన రాజీనామాకు అధిష్టానం సైతం ఆమోదం తెలిపింది. కర్ణాటక కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనపై నమ్మకంతో అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన కె.అన్నామలై.. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ అవసరం ఉందని.. కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాల్సి ఉందని.. ఆ దిశగానే రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు . రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని.. ఆ తర్వాత 2031లో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామన్నారాయన. ఈ ఐదేళ్లల్లో రాజకీయ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు అన్నామలై.
