- మూడో రోజు కిలోమీటర్ల కొద్దీ నడిచిన ప్రతినిధులు
- వీఐపీల రాకపోకలతో రోడ్ల మూసివేత
- సమీప మెట్రోస్టేషన్ కూడా బంద్
- సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
న్యూఢిల్లీ: ఇండియా ఏఐ సమిట్‌లో మూడో రోజూ నిర్వాహకుల వైఫల్యం బట్టబయలైంది. భారత్ మండపం వద్ద జరిగిన కార్యక్రమం అనంతరం సరైన సదుపాయాలు లేక పలువురు ప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీల రాకపోకలతో సమీప రోడ్లపై వాహనాల ప్రవేశాన్ని పోలీసులు నిలిపివేయడంతో క్యాబ్‌లు అందుబాటులో లేకుండా పోయాయి. కెనడా పౌరుడు కాలెబ్ ఫ్రైజెన్ గత ఎనిమిదేండ్లుగా భారత్‌లో నివసిస్తున్నాడు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ బాగుందని చెప్పిన అతడు, ముగింపు సమయంలో ఎదురైన అనుభవం అన్ని సానుకూలతలను మరిచిపోయేలా చేసిందన్నాడు. సాయంత్రం 7.40 సమయంలో బయటకు రాగానే క్యాబ్‌లు, షటిల్ సర్వీసులు లేవని రోడ్డుపై నడవాలని సోషల్ మీడియాలో సూచించారని వాపోయాడు. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు భారత్ ప్రతిష్టను ఇది దెబ్బతీసిందని, దివ్యాంగులకు ఇది ఇబ్బందికరంగా మారిందని అతడు వ్యాఖ్యానించాడు.
దీపిక నారాయణ భరద్వాజ్ అనే మహిళ కూడా రోడ్లు మూసివేశారని, సమీప మెట్రో స్టేషన్‌ను బంద్ చేశారని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తన బంధువు రాత్రి 8 గంటల నుంచే క్యాబ్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వమే పరిమిత పార్కింగ్ ఉందని క్యాబ్‌లలో రావాలని ముందుగా సూచించినప్పటికీ, చివరకు వాటి ప్రవేశాన్ని అడ్డుకోవడం విమర్శలకు దారితీసింది. సహిల్ రాజ్‌పుత్ అనే వ్యక్తి క్యాబ్ ఎక్కాలంటే ఐదు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని తెలిపాడు. వీఐపీ రాకపోకల పేరుతో గేట్లు, రోడ్లు మూసివేయడాన్ని అతడు తీవ్రంగా తప్పుబట్టాడు.ఈ ఘటనలు ఏఐ సమిట్ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ప్రధాని మోదీ విందుకు హాజరు కాలేకపోయిన సీఈవో
ఢిల్లీలో నెలకొన్ని ట్రాఫిక్‌తో ఒక విదేశీయురాలు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఏఐ సమిట్ సందర్భంగా బుధవారం రాత్రి ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందుకు ‘అడాప్షన్ ల్యాబ్స్’ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ సారా హుకర్ హాజరుకాలేకపోయారు.
ఏఐ సమిట్ సెషన్లలో పాల్గొన్న తర్వాత ఆమె సాయంత్రం విందు కోసం దుస్తులు మార్చుకోవడానికి తన హోటల్‌కు వచ్చారు. సాధారణ జీన్స్ నుంచి అఫీషియల్ దుస్తుల్లోకి మారి, ప్రధాని ఇచ్చే విందుకు బయలుదేరారు. అయితే, భారత్ మండపం చేరుకోవడానికి ఆమెకు ఏకంగా నాలుగు గంటల సమయం పట్టింది. విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోవడంతో, గమ్యస్థానానికి చేరుకోలేక ఆమె వెనక్కి రావాల్సి వచ్చింది.
