- ఇప్పటికే ఏఐ కెమెరాలతో దళారుల గుర్తింపు
- త్వరలో మిగతా ఆఫీసుల్లోనూ అమలు
- వాహనాల తనిఖీల్లోనూ వాడాలని నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జంటనగరాల్లో వాహనాల తనిఖీల్లో ఏఐ వాడకంతో పాటు ఆర్టీఏ ఆఫీసుల్లో దళారులను ఏరివేసే ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాగోల్ఆర్టీఏ ఆఫీసుల్లో దళారులను గుర్తించేందుకు ఏఐ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆఫీసుకు వస్తున్న వారి ముఖాలను గుర్తించి ఎక్కువ సార్లు వచ్చిన వారి వివరాలను అధికారులకు చేరవేస్తుంది.
దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాగోల్ ఆర్టీఏ ఆఫీసుల్లో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయగా, ఈ విధానాన్ని త్వరలోనే మలక్పేట, బండ్లగూడ, ఉప్పల్, తదితర ఆర్టీఏ ఆఫీసుల్లో తీసుకురానున్నారు.
వాహన తనిఖీల్లోనూ..
ఇప్పటివరకు వెహికల్స్తనిఖీల టైంలో వాహనదారుల దగ్గర పేపర్లు పరిశీలించి కాలుష్యం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, ట్యాక్స్ చెల్లింపు, ఫిట్నెస్ వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక నుంచి అలా కాకుండా వాహన నెంబర్ టైప్చేయగానే పూర్తి సమాచారం వచ్చేలా ఏఐ టూల్స్ వినియోగించనున్నట్టు అధికారులు తెలిపారు. దీని వల్ల ఎక్కువ సమయం వృథాకాదంటున్నారు. ఏఐ టూల్స్ వినియోగంపై ఉన్నతాధికారులు ఇప్పటికే దాదాపు 300 మంది కానిస్టేబుల్స్, కొందరు ఏఎంవీఐలకు శిక్షణ ఇప్పించినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఏఐ ఎలా వాడాలన్న దానిపై ట్రిపుల్ఐటీ, మరికొన్ని సాఫ్ట్ వేర్సంస్థల సహకారం తీసుకుంటున్నారు.
