పేటీఎం ‘ఆల్ ఇన్ వన్’ కోడ్‌‌

పేటీఎం ‘ఆల్ ఇన్ వన్’ కోడ్‌‌

    వాలెట్, యూపీఐ మరియు రూపే కార్డుల నుంచి చెల్లించవచ్చు

    తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మందికి ఇస్తామన్న కంపెనీ

హైదరాబాద్, వెలుగు: యూపీఐ, వాలెడ్‌‌, రూపే డెబిట్‌‌కార్డుల ద్వారా కస్టమర్లు వ్యాపారసంస్థలకు డబ్బు చెల్లించడానికి పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్‌‌ కంపెనీ) ‘ఆల్‌‌ ఇన్ వన్‌‌’ క్యూఆర్‌‌ కోడ్‌‌ను హైదరాబాద్‌‌ సహా పలు నగరాల్లో సోమవారం విడుదల చేసింది. రాబోయే ఆరు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మందికి ఈ కోడ్‌‌లను అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించింది. వ్యాపారులు కస్టమర్ల నుంచి తీసుకున్న పేమెంట్స్‌‌ను ఉచితంగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చు. ‘పేటీఎం ఫర్ బిజినెస్’ యాప్ ద్వారా అన్ని రకాల చెల్లింపులను చేసుకోవచ్చు.  కాలిక్యులేటర్, పవర్ బ్యాంక్, క్లాక్, పెన్ స్టాండ్స్, రేడియో వంటి వస్తువులతో జతచేసిన క్యూఆర్‌‌ కోడ్‌‌లను కూడా ఈ సందర్భంగా విడుదల చేసింది. వ్యాపారుల పేర్లు, లోగోలు, ఫొటోలతో కూడిన పర్సనల్‌‌, సౌండ్‌‌బాక్స్‌‌ క్యూఆర్ కోడ్ లను కూడా తయారు చేసింది.  వీటిని ‘పేటీఎం ఫర్ బిజినెస్’ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు  ‘పేటీఎం బిజినెస్ ఖాతా’ ద్వారా డిజిటల్ లెడ్జర్లను నిర్వహించవచ్చని కంపెనీ తెలిపింది.   క్రెడిట్ లావాదేవీలకు చెల్లింపు తేదీని సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటెడ్ రిమైండర్స్‌‌ను పంపించడం వంటి పనులు చేసుకోవచ్చు.  ఈ సందర్భంగా పేటీఎం  సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత ఏడాది 60 శాతం వ్యాపారవృద్ధిని సాధించాం.  దేశవ్యాప్తంగా గత ఏడాది రెండు వందల కోట్ల క్యూఆర్‌‌ కోడ్‌‌ లావాదేవీలు జరిగాయి. 1.5 కోట్ల మంది వ్యాపారులు పేటీఎం బిజినెస్ క్యూఆర్‌‌ కోడ్‌‌లను వాడుతున్నారు. మరికొన్నేళ్లో 50 లక్షల మందిని ప్రధాన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలనే టార్గెట్‌‌తో పనిచేస్తున్నాం’’ అని వివరించారు.