సికింద్రాబాద్ ‘లష్కర్’ గుడిలో అర్చక నియామకాల లొల్లి

సికింద్రాబాద్ ‘లష్కర్’ గుడిలో అర్చక నియామకాల లొల్లి
  •     అర్హులను కాదని పైరవీలకే  పట్టం కట్టారనే ఆరోపణలు  
  •     విచారణ జరిపిన అడిషనల్ కమిషనర్​

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ శ్రీఉజ్జయినీ మహంకాళి ఆలయంలో అర్చక, పరిచారక పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, అర్హతలను పక్కనబెట్టి పైరవీలకే పెద్దపీట వేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది నవంబర్​లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆగమ శాస్త్రంలో ప్రావీణ్యం, వేద పాఠశాల సర్టిఫికెట్ ఉన్నవారినే నియమించాల్సి ఉండగా, రూల్స్​బ్రేక్​చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

చండీపారాయణం, అర్చక, రెండు పరిచారక, రెండు వంటస్వాములకు కలిపి మొత్తం ఆరు పోస్టులకు దరఖాస్తులను పిలవగా, అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న తమకు కనీసం కాల్ లెటర్లు కూడా పంపలేదని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అధికారులకు కావాల్సిన వారికి, రాజకీయ నాయకుల సిఫార్సులున్న వారికే అంతర్గతంగా ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులు కట్టబెట్టారంటున్నారు. 

ఎండోమెండ్​ ఆఫీసులో విచారణ 

కాగా, ఈ వివాదంపై ఎండోమెంట్​హెడ్డాఫీసులో గురువారం అడిషనల్​కమిషనర్​కృష్ణవేణి ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి పలువురు అభ్యర్థుల నుంచి అభిప్రాయాలను నమోదు చేశారు. విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.  

అవకతవలకు జరగలే...

వివాదంపై ఈవో మనోహర్ రెడ్డి స్పందిస్తూ ‘నియామకాల్లో అవకతవకలు జరగలే.. 50 మంది అప్లై చేసుకుంటే అర్హత ఉన్న 16 మందిని ఇంటర్వ్యూలకు పిలిచాం. నిపుణుల కమిటీ సమక్షంలోనే ఎంపిక ప్రక్రియ సాగింది. ప్రస్తుతం అర్చక, చండీ పారాయణ విభాగాల్లో ఒక్కొక్కరిని మాత్రమే ఎంపిక చేశాం. ఆరోపణలు రావడంతో ప్రస్తుతానికి ఎంపిక ప్రక్రియను వాయిదా వేశాం’ అని చెప్పారు.