- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారులకు సత్కారం
- సన్మానం పొందిన డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి, సుమతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నక్సలిజాన్ని సమూలంగా అణచివేసి, మావోయిస్టురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పోలీసుల పనితీరు భేష్ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. నక్సలిజం నిర్మూలన పోరాటంలో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన జవాన్లు ప్రాణత్యాగం చేశారని, వారి బలిదానాల వల్లే నేడు విజయం సాధ్యమైందని అన్నారు.
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టుల నిర్మూలనకు కృషి చేసిన పోలీస్ అధికారులను చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా సన్మానించారు. డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ బీ శివధర్‌రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్స్) అనిల్ కుమార్, మల్కాజ్‌గిరి కమిషనర్, మాజీ ఎస్‌ఐబీ ఐజీపీ సుమతితోపాటు ఆమె నేతృత్వంలోని ఎస్‌ఐబీ బృందాన్ని సత్కరించారు.
సాధ్యం కాదన్నారు.. పక్కా వ్యూహంతో సాధించాం
నక్సలిజం కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదని, తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌తోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన ఉండేదని అమిత్ షా తెలిపారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, మావోయిస్టురహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందులో భాగంగానే జనవరి 2024లో జరిగిన అంతర్గత సమావేశంలో 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని కాలపరిమితిని నిర్దేశించుకున్నట్టు తెలిపారు.
ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది ప్రైవేట్ చర్చల్లో ఇది సాధ్యం కాదంటూ సందేహాలు వ్యక్తం చేశారని అన్నారు. స్పష్టమైన ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ముందుకు సాగామని వెల్లడించారు. దంతేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఈ రోజు బస్తర్ ప్రాంతాన్ని మావోయిస్టురహితంగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సలిజం నుంచి విముక్తి పొందిందన్నారు.
