బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్లపై సీబీఐతో విచారణ జరిపించాలి

బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్లపై సీబీఐతో విచారణ జరిపించాలి
  •     జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు ఊదరి గోపాల్

హైదరాబాద్, వెలుగు: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల జారీ ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో విచారణ జరిపించాలని జీహెచ్ఎంఈయూ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్) అధ్యక్షుడు, బీజేపీ మజ్దూర్ సెల్ సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై జీహెచ్ఎంసీలో కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేస్తున్నారని, ఇందులో అడిషనల్, జోనల్ కమిషనర్ల పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. రోహింగ్యాలకు బర్త్ సర్టిఫికెట్లు అక్రమంగా జారీ చేస్తున్నారని 2021 సెప్టెంబర్ 8న తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. మెడికల్ హెల్త్ అసిస్టెంట్లు రూ. లక్షల్లో లంచాలు ఇస్తూ.. బల్దియాలో పోస్టింగ్​లు తెచ్చుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఇష్యూపై  కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితే అసలైన దోషులు ఎవరో బయటపడుతారని గోపాల్ అన్నారు. ఇదే విషయమై గవర్నర్ తమిళిసైతో పాటు హైకోర్టు, లోకాయుక్త, సీఎస్, మున్సిపల్ చీఫ్ సెక్రటరీ, ఐజీ, స్టేట్ విజిలెన్స్, ఏసీబీ, ఇంటెలిజెన్స్, బల్దియా కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్​కు లెటర్ రాసినట్లు ఆయన చెప్పారు. బర్త్, డెత్, ప్రాపర్టీ టాక్స్, కమర్షియల్ ట్యాక్స్, శానిటేషన్, వెటర్నరీ, ఎంటమాలజీ, ట్రాన్స్ పోర్టు సెక్షన్లలో పనులను బల్దియా ఉద్యోగులతోనే చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.  
కార్యక్రమంలో  జనరల్ సెక్రటరీ నర్సింగ్ రావు  పాల్గొన్నారు.