గంజాయి సప్లయర్‌‌‌‌కు 20 ఏండ్లు జైలు

గంజాయి సప్లయర్‌‌‌‌కు 20 ఏండ్లు జైలు

హైదరాబాద్‌‌, వెలుగు: అంతర్రాష్ట్ర గంజాయి సప్లయర్‌‌‌‌కు హైదరాబాద్‌‌లోని నాంపల్లి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో మూడేండ్ల జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. నార్కొటిక్ డ్రగ్‌‌ అండ్ సైకోట్రొపిక్ సబ్‌‌స్టాన్సస్ (ఎన్‌‌డీపీఎస్‌‌) యాక్ట్‌‌ కేసులో ఓ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి. 2020లో నమోదైన ఈ కేసు వివరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నదీం(25) ట్రక్ డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ఏపీలోని వైజాగ్‌‌ ఏజెన్సీలోని గంజాయి సప్లయర్స్‌‌తో కలిసి మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్‌‌ చేసేవాడు. 2020 ఆగస్టు 18న 1,427 కిలోల గంజాయి లోడ్‌‌తో వైజాగ్‌‌ నుంచి బయలుదేరాడు. దీనిపై నిఘా పెట్టిన డీఆర్‌‌‌‌ఐ అధికారులు.. గంజాయి లోడ్‌‌తో వచ్చిన నదీం ట్రక్‌‌ను ఆగస్టు 20న ట్రేస్ చేసింది. విజయవాడ, హైదరాబాద్‌‌ హైవేలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌‌ ప్లాజా వద్ద నదీం ట్రక్‌‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. తర్వాత ఆ మరుసటి రోజు (ఆగస్టు 21వ తేదీ) నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌‌ సెషన్స్‌‌ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టారు. ఎన్‌‌డీపీఎస్‌‌ యాక్ట్‌‌–1985 కింద చార్జిషీట్‌‌ ఫైల్‌‌ చేశారు. సీజ్‌‌ చేసిన గంజాయితో పాటు కేసు తీవ్రతను కోర్టుకు డీఆర్‌‌‌‌ఐ అధికారులు వెల్లడించింది.