వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే

వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే

శరీరం తీవ్రమైన వేడిని తట్టుకోలేనప్పుడు వడదెబ్బ తగులుతుంది. నార్మల్ బాడీ టెంపరేచర్​ 98.6 డిగ్రీల ఫారెన్​హీట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. బాడీ టెంపరేచర్​ సాధారణం కంటే పెరిగి 104 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎండలో బయటకు వెళ్లడం, ఎక్కువ సేపు ఉండడం వల్ల వడదెబ్బ తగులుతుంది.

జ్వరం వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్​ పెరగడం అనేది సాధారణం. మెడిసిన్ వేసుకోవడం వల్ల చెమటలు పట్టడంతోపాటు శరీరంలో వేడి తగ్గుతుంది. కానీ వేసవిలో పొడి వాతావరణం వల్ల చెమట పట్టదు. శరీరం నుంచి చెమట బయటకు రాకపోతే శరీరం వేడెక్కుతుంది. దాంతో టెంపరేచర్​ కంట్రోల్​ కాదు. అప్పుడు వడదెబ్బ తగులుతుంది. దానివల్ల స్పృహ తప్పి పడిపోతారు. ఆ ఎఫెక్ట్​ ఎక్కువగా ఉంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మరణాలకి దారితీస్తుంది. 

వడదెబ్బ లక్షణాలు ఇవే

వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్​ కొన్ని గంటల్లోనే చూపిస్తుంది. 

 

  •     ఎండలోకి వెళ్లినప్పుడు ఒక్కసారిగా తల తిరగడం.
  •      కళ్ల ముందు చీకట్లు కమ్మడం
  •      బీపీ, షుగర్ లెవల్స్ పడిపోవడం
  •     నాలుక పొడిబారడం
  •      కళ్లు బైర్లు కమ్మడం
  •      విపరీతమైన దాహం
  •      చర్మం పొడిబారడం
  •      పెదవులు పగిలిపోవడం
  •     మాట్లాడేటప్పుడు తడబాటు
  •     మూర్ఛ
  •     కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం
  •     ఛాతిలో ఇబ్బంది
  •     నీరసం, నిస్సత్తువ (హీట్ ఎగ్జాషన్) వంటి సింప్టమ్స్ కనిపిస్తాయి.

ఏం చేయాలి?

శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్​హీట్​కు మించి ఉన్నప్పుడు సమస్య వస్తుంది. కాబట్టి ఎండలో ఎక్కువ టైం పనిచేసేవాళ్లు వడదెబ్బ లక్షణాలు కనపడగానే నీడలోకి వెళ్లాలి. అలాంటప్పుడు శరీరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేయాలి. 


తల, ఛాతి, నడుము, చేతులు, కాళ్లలో ఐస్ లేదా గోరువెచ్చని క్లాత్​తో రుద్దడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో ఐస్​క్యూబ్స్​తో మసాజ్ చేయాలి. ఎందుకంటే ఈ భాగాల్లో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి. ఐస్​తో మసాజ్ చేస్తే అవి చల్లబడి బాడీ టెంపరేచర్​ తగ్గుతుంది. 

వడదెబ్బ తగిలిన వాళ్లకు గాలి బాగా తగిలే ఏర్పాట్లు చేయాలి. వ్యక్తి స్పృహలో ఉంటే నీరు లేదా ఎలక్ట్రోలైట్స్​ ఉన్న హెల్దీ డ్రింక్స్‌ తాగించాలి.
చల్లటి నీళ్లతో స్నానం చేయించాలి లేదా చల్లని నీటి టబ్​లో కూర్చోబెట్టాలి. ఇలా చేస్తే కాళ్ల వాపు తగ్గుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 
యంగ్ ఏజ్​లో ఉన్నవాళ్లు హెల్దీగా ఉండి, ఎక్కువగా వర్కవుట్స్ చేసి వడదెబ్బ​ బారినపడితే దాన్ని ‘ఎక్జర్షనల్ హీట్ స్ట్రోక్’ అంటారు. శరీరాన్ని చల్లబరిచేందుకు వాళ్లకు ఐస్​ బాత్ చేయించాలి. 
బయట తిరగకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. కొబ్బరి నీళ్లు, ఫ్రూట్ జ్యూస్​లు తాగుతూ బాడీని హైడ్రేట్​గా ఉంచుకోవాలి. 
బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు, గొడుగు, క్యాప్​ తీసుకెళ్లాలి. వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. 
నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్​ ఫుడ్​, మసాలాలు, కారం, ఫాస్ట్‌‌ఫుడ్స్‌‌, కాఫీ, ఆల్కహాల్‌‌, ఐస్‌‌క్రీమ్‌‌, కూల్‌‌ డ్రింక్స్‌‌కి దూరంగా ఉండాలి.
కఠిన వ్యాయామం తగ్గించి ఉదయంపూట యోగా, వాకింగ్‌‌ వంటివి చేయాలి.
పసిపిల్లలకు ఉదయం 8 గంటల లోపు, సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే స్నానం చేయించాలి.
పసివాళ్లకు తరచూ తల్లిపాలు పట్టాలి. రబ్బరు లేదా ఎలాస్టిక్ డైపర్లు వాడకూడదు.
వీలైతే ఇంట్లోనే ఉండాలి. కిటికీలు, తలుపులు మూసివేయాలి. సాధ్యమైనంతవరకు ఎండలో ప్రయాణాలు మానుకోవాలి. కాంక్రీట్ నేలపై పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు ఆనుకుని కూర్చోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌‌ప్లగ్ చేసి ఉంచాలి.