కాంగ్రెస్​ స్టీరింగ్ కమిటీ చైర్మన్​ పదవికి ఆనంద్​ శర్మ రాజీనామా

కాంగ్రెస్​ స్టీరింగ్ కమిటీ చైర్మన్​ పదవికి ఆనంద్​ శర్మ రాజీనామా
  • హిమాచల్​ స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ పదవికి రాజీనామా
  • ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనంటూ పార్టీ చీఫ్​సోనియా గాంధీకి లేఖ
  • ఎన్నికల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని హామీ

న్యూఢిల్లీ : హిమాచల్​ప్రదేశ్​ కాంగ్రెస్​ స్టీరింగ్ కమిటీ చైర్మన్​ పదవికి ఆ పార్టీ సీనియర్​ లీడర్​ ఆనంద్​ శర్మ ఆదివారం రాజీనామా చేశారు. హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ముందు శర్మ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజీనామా లేఖను కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సోనియా గాంధీకి పంపారు. తనకూ ఆత్మగౌరవం ఉందని, రాజీ పడలేనని,  అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. రిజైన్​ చేసిన తర్వాత ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సభలకు సంబంధించిన కీలక సమాచారం కూడా తనకు అందడంలేదని అసహనం వ్యక్తంచేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించినట్టు వివరించారు. స్టీరింగ్ కమిటీ విధులపై కూడా పూర్తి స్పష్టత ఇవ్వాలని ఏఐసీసీ ఇన్​చార్జిని కోరారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కోర్ గ్రూపులోని సీనియర్ లీడర్లంతా ఢిల్లీ, సిమ్లాలో రెండుసార్లు భేటీ అయ్యారని, అయినా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టీరింగ్​ కమిటీ చైర్మన్​గా ఉండలేనని తేల్చి చెప్పారు. హిమాచల్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల తరఫున తప్పకుండా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది హిమాచల్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 26న ఈ కమిటీ ఏర్పాటు చేశారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ డిప్యూటీ లీడర్​ ఆనంద్​ శర్మను కాంగ్రెస్​ అధిష్టానం ఈ కమిటీకి చైర్మన్​గా నియమించింది.