ఎస్పీ బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధానికి జగన్ లేఖ

ఎస్పీ బాలుకు ‘భారతరత్న’ ఇవ్వాలని ప్రధానికి జగన్ లేఖ

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సీఎం జగన్ సోమవారం సాయంత్రం ప్రధానికి రాసిన లేఖలో కోరారు.

ఎస్పీ బాలు త‌మ రాష్ట్రంలో జ‌న్మించ‌డం ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టమన్న సీఎం జగన్ ఆయన అకాల మరణం ఎంతోమంది అభిమానులను, ప్రముఖలను కలిచి వేస్తోందని అన్నారు. మాతృభాషలో 40వేలకు పైగా పాటుల పాడి, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా ఎన్నో గీతాలను ఆలపించారన్నారు. ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారని, ఏపీ ప్రభుత్వం నుంచి 25నంది అవార్డులతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అనేక అవార్డులు పొందారని లేఖ‌లో తెలిపారు.

భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, పద్మభూషన్ 2011లో బాలుకు ప్రధానం చేశాయ‌న్న జ‌గ‌న్ లేఖ‌లో వెల్ల‌డించారు. గతంలో సంగీత దిగ్గజాలు లతా మంగేష్కర్, భూపేన్ హజారికా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీంసేన్ జోషి వంటివారికి సైతం భారతరత్న ఇచ్చిన విషయం సీఎం జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు. ఐదు దశాబ్దాల మర్చిపోలేని సేవలు అందించిన ఆయనకు ఇది మంచి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని లేఖలో జగన్ వివరించారు.