మీ ఆస్తులు చెప్పకపోతే జైలే!.అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్

మీ ఆస్తులు చెప్పకపోతే జైలే!.అనిల్ అంబానీకి కోర్టు వార్నింగ్

లండన్: ఇండస్ట్రియలిస్టు అనిల్ అంబానీకి లండన్ కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నెల 20లోపు.. ఆస్తులు, అప్పులు, ఖర్చులు, ఆదాయాల వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. లేకపోతే జైలుకు పంపిస్తామని, ఆస్తులనూ జప్తు చేస్తామని హెచ్చరించింది. లక్ష డాలర్లకు పైగా విలువ ఉన్న అన్ని ఆస్తుల వివరాలను బయటపెట్టాలని స్పష్టం చేసింది. అనిల్ అంబానీ తమకు 717 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,354 కోట్లు) విలువైన బాకీలను చెల్లించడం లేదంటూ మూడు చైనా బ్యాంకులు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా మాస్టర్ డేవిసన్ కమర్షియల్ కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. వీటి అప్పులను చెల్లించాలని ఈ ఏడాది మే నెలలోనే జస్టిస్ నిగెల్ టియర్ తీర్పు చెప్పారు. ఆర్‌‌కామ్ కోసం అంబానీ పర్సనల్ గ్యారంటీ ఇచ్చి, 900 మిలియన్ డాలర్ల అప్పు తీసుకున్నారని బ్యాంకులు ఆరోపించాయి. తాను అలాంటి గ్యారంటీ ఇవ్వలేదని, బాకీ చెల్లించే స్తోమత లేదని అంబానీ వాదిస్తున్నారు. 2008 వరకు ఇండియాలోనే ఆరో పెద్ద సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం తన నెట్‌‌వర్త్ విలువ సున్నాకు చేరిందని ప్రకటించారు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి బ్యాంకు స్టేట్‌‌మెంట్లను, క్రెడిట్‌‌కార్డు వివరాలను కోర్టుకు అందజేశారు. అయితే కోర్టు మాత్రం అంబానీ వాదనతో విబేధిస్తూ అప్పులు కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.