అనిల్‌‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

అనిల్‌‌ అంబానీ రాజీనామా తిరస్కరణ

న్యూఢిల్లీ:  ఆర్‌‌కామ్‌‌ డైరెక్టర్‌‌గా అనిల్‌‌ అంబానీ రాజీనామా చేయడాన్ని లెండర్లు తిరస్కరించారు.  అంబానీతోపాటు ఆర్‌‌కామ్‌‌ డైరెక్టర్లు రైనా కరానీ, ఛాయా విరానీ, మంజరి కాకర్‌‌, సురేశ్‌‌ రంగాచార్‌‌ల రాజీనామాలనూ తోసిపుచ్చారు. డైరెక్టర్లుగా కొనసాగుతూనే ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియకు సహకరించాలని కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ) సూచించిందని ఆర్‌‌కామ్‌‌ ఎక్సేంజ్‌‌ ఫైలింగ్‌‌లో వెల్లడించింది. వీరంతా ఈ నెల రెండోవారంలో తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. రాజీనామాలను అంగీకరించకూడదని సీఓసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రిజల్యూషన్‌‌ నిపుణుడికి సహకరించాలని సూచించింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన రెండో క్వార్టర్‌‌కు ఆర్‌‌కామ్‌‌ ఏకంగా రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు టెల్కోలను ఆదేశించడంతో ఈ కంపెనీ నష్టం అమాంతం పెరిగింది. ఒక క్వార్టర్‌‌లో అత్యంత భారీగా నష్టాన్ని ప్రకటించిన రెండో ఇండియా కంపెనీగా ఆర్‌‌కామ్‌‌ నిలిచింది. ఏజీఆర్ బకాయిల వల్ల వొడాఫోన్‌‌ ఐడియా రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అడ్జెస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌) బకాయిల కోసం ఆర్‌‌కామ్‌‌ రూ.28,314 కోట్లను కేటాయించింది. ఏజీఆర్‌‌ విషయంలో ప్రభుత్వ వాదననే సమర్థించిన సుప్రీంకోర్టు టెలికమ్యూనికేషన్స్‌‌కు చెందని ఆదాయాన్ని కూడా ఏజీఆర్‌‌లో కలపాలని తీర్పు చెప్పింది. ఆర్‌‌కామ్‌‌ లైసెన్సు ఫీజుగా రూ.23,327 కోట్లు, స్పెక్ట్రమ్‌‌ యూసేజ్‌‌ చార్జ్​గా రూ.4,987 కోట్లు కట్టాలి. టెలికం కంపెనీలన్నీ కలసి రూ.93 వేల కోట్ల వరకు ఏజీఆర్‌‌గా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే.

ఎరిక్సన్‌‌ ఫిర్యాదుతో..

స్వీడిష్‌‌ టెలికం కంపెనీ ఎరిక్సన్‌‌ ఫిర్యాదుతో ఆర్‌‌కామ్‌‌ దివాలా ప్రక్రియ ఈ ఏడాది జూన్‌‌లో మొదలయింది. ఈ కంపెనీ అప్పుల పరిష్కార బాధ్యతను ఎన్సీఎల్టీ రిజల్యూషన్‌‌ ప్రొఫెషనల్‌‌కు అప్పగించింది. ఆర్‌‌కామ్‌‌ అప్పులు రూ.33 వేల కోట్ల వరకు ఉంటాయన్నది మార్కెట్‌‌ వర్గాల అంచనా కాగా, తమకు రూ.49 వేల కోట్లు చెల్లించాలని లెండర్లు అంటున్నారు. దివాలా కేసు నమోదు కాకముందే, ఆర్‌‌కామ్‌‌ తన స్పెక్ట్రమ్‌‌, టవర్లు, ఫైబర్‌‌ నెట్‌‌వర్క్‌‌ను అమ్మకానికి పెట్టింది. వీటిని అమ్మితే రూ.14 వేల కోట్ల వచ్చి ఉండేవి. ఎన్సీఎల్టీ పరిధిలోకి రావడంతో ఈ ఆస్తులన్నీ రిజల్యూషన్‌‌ ప్రొఫెషనల్‌‌ అనీశ్‌‌ నిరంజన్‌‌ నానావటి అధీనంలోకి వచ్చాయి. ముకేశ్‌‌, అనిల్ అంబానీ సోదరులు 2005లో ఆస్తులను పంచుకోగా, టెలికం వ్యాపారం అనిల్‌‌కు దక్కింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నులో ఒకరిగా నిలిచిన అనిల్‌‌కు.. ఇప్పుడు బిలియనీర్‌‌ హోదా కూడా లేదు.