- కల్వకుర్తి, నెట్టెంపాడు తప్ప దేనినీ ఒప్పుకోరట..
- ఎస్ఎల్బీసీని ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించలేదట..
- దానిని షెడ్యూల్ 11లో పెట్టనందున దానికి మళ్లీ అనుమతులు తీసుకోవాలట..
- కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ అడ్డమైన వాదనలు
- తెలంగాణకు 299 టీఎంసీలకు మించి ఒక్క చుక్క ఇచ్చేది లేదన్న పొరుగురాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా ట్రిబ్యునల్ వేదికగా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మరోసారి విషం కక్కింది. కృష్ణా బేసిన్లో ఉన్న నీళ్లన్నీ తమవే అన్నట్టుగా.. తెలంగాణకు ఏమీ లేవన్నట్టుగా వాదనలు వినిపించింది. షెడ్యూల్ 11లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు తప్ప తెలంగాణ చేపట్టిన అన్ని ప్రాజెక్టులూ కొత్తవేనని అడ్డమైన వాదనలకు దిగింది. ఎప్పుడో ఉమ్మడి ఏపీలోనే తలపెట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూడా కొత్తదేనని వాదించింది.
పాలమూరు రంగారెడ్డి సహా రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చి చెప్పింది. బుధవారం కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ తన తుదిదశ వాదనలను కొనసాగించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ స్కీమ్‌లకు మాత్రమే ఒప్పుకుంటామని చెప్పిన ఏపీ.. దానికీ మెలిక పెట్టింది. ఆ రెండు ప్రాజెక్టులు కూడా సర్ప్లస్ వాటర్ ఆధారంగా 65 శాతం డిపెండబిలిటీతో కట్టినవని, 75 శాతం డిపెండబిలిటీ కింద వాటిని ఒప్పుకునేది లేదని పేర్కొంది.
ఆయా ప్రాజెక్టులను 25 టీఎంసీలు, 22 టీఎంసీల నీటి వాటాలకే ఒప్పుకుంటామని తెలిపింది. షెడ్యూల్ 11లో కొత్త ప్రాజెక్టులను చేర్చి కడ్తామంటే ఊరుకునేది లేదని వాదనలకు దిగింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును వాస్తవానికి 1986లోనే ఎస్ఆర్బీసీ కట్టేటప్పుడే ప్రతిపాదించారు. కానీ, ఇప్పుడు మాత్రం ఏపీ మాట మార్చింది. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఆ ప్రాజెక్టును ప్రతిపాదించలేదని, అది కూడా కొత్త ప్రాజెక్టేనని ట్రిబ్యునల్ ముందు వాదించింది.
ఆ ప్రాజెక్టు కూడా షెడ్యూల్ 11లో లేదని, దానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. కృష్ణా బేసిన్లో తెలంగాణకున్నది కేవలం 299 టీఎంసీల జలాలేనని, అంతకుమించి ఒక్క చుక్క కూడా ఇచ్చేది లేదని ట్రిబ్యునల్‌కు తెలిపింది. జూరాల ప్రాజెక్టుకూ 9 టీఎంసీల నీటి లభ్యతను 65 శాతం డిపెండబిలిటీ కిందే ఇచ్చారని పేర్కొంది.
ఆ ప్రాజెక్ట్ ఆధారంగా నిర్మిస్తున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్.. దానిని ఓవర్‌ల్యాప్ చేస్తూ నిర్మిస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో ఆ ప్రాజెక్టును అంగీకరించబోమని తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో ప్రాజెక్టులవారీ కేటాయింపులను చేసిందని, మళ్లీ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటూ నీటి వాటాల పంపిణీకి ఒప్పుకునేది లేదని పేర్కొంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కొత్త ప్రాజెక్టులకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చారని, ఆ లెక్కన తెలంగాణలో ఉన్నవన్నీ కొత్త ప్రాజెక్టులేనని వాదించింది.
