రఘురామ కేసులో ఏపీ పోలీస్ దూకుడు.. బీహార్‌లో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

రఘురామ కేసులో ఏపీ పోలీస్ దూకుడు.. బీహార్‌లో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

ఏపీ రాజకీయ, పోలీసు వర్గాల్లో సోమవారం చోటుచేసుకున్న సంచలన పరిణామం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 2021లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంలో జరుగుతున్న అత్యంత కీలకమైన అరెస్ట్ ఇదే కావడం గమనార్హం.

వాస్తవానికి సునీల్ నాయక్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై వచ్చి, సీఐడీ విభాగంలో డీఐజీగా పనిచేశారు. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన తిరిగి తన సొంత కేడర్ అయిన బీహార్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ ఫైర్ సర్వీసెస్ విభాగంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని గతంలో పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ.. సునీల్ నాయక్ స్పందించలేదు. దీంతో గుంటూరు జిల్లా పోలీసులు బీహార్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ట్రాన్సిట్ వారెంట్‌పై గుంటూరుకు తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు అధికారులు.

2021 మే 14న అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లోని నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో తనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని, విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పినా వినకుండా బలవంతంగా గుంటూరుకు తరలించారని రఘురామ ఆరోపించారు. సీఐడీ కార్యాలయంలో తనను రబ్బరు బెల్టులు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని.. తనకు మందులు కూడా వేసుకోనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా తాను బైపాస్ సర్జరీ చేయించుకున్నానని తెలిసి కూడా కొందరు వ్యక్తులు తన ఛాతిపై కూర్చుని ఒత్తిడి చేసి చంపడానికి ప్రయత్నించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారులు పివి. సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సునీల్ నాయక్, విజయ్ పాల్‌తో పాటు మరికొందరిపై హత్యాయత్నంతో పాటు వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ వరుసలో సునీల్ నాయక్ అరెస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిగిలిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఏపీ పోలీసులు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారనే ఆరోపణలే బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అరెస్టుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.